- నిండుకుండలా 40 చెరువులు మళ్లీ భారీ వానలు పడితే డేంజరే
- పలు చెరువులు ఎఫ్టీఎల్ పరిధి దాటి నిండటంతో కాలనీల్లోకి
- ప్రవహిస్తోన్న వరద నీరు మానిటరింగ్‌కు బల్దియా నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌లోని చెరువులు నిండిపోయాయి. కొన్నిచోట్ల నీరు బయటకు వెళ్లేందుకు వీలు లేక పొంగిపొర్లుతున్నాయి. మరికొన్ని బ్యాక్ వాటర్‌తో కాలనీలను చుట్టుముట్టాయి. దీనికంతటికి సిటీలో దాదాపు అన్ని చెరువులు కబ్జాల పాలయ్యాయి. చెరువుల్లోనే కాలనీలు పుట్టుకొచ్చాయి. గుర్రం చెరువు, దుర్గం చెరువు, సరూర్ నగర్ చెరువు, బతుకమ్మ చెరువు, తీగలసాగర్ చెరువు, రాయసముద్రం చెరువు, చందం చెరువు, సాకి చెరువు, సూరారం పెద్ద చెరువు, తిమ్మక్క చెరువు, అప్పా చెరువు, పల్లె చెరువు, బాలాపూర్ పెద్దచెరువులతో సహా చాలా ప్రాంతాల్లో చెరువులు ఆక్రమణలతో నామమాత్రంగానేమిగిలాయి.
పొంగిపొర్లుతుండగా..
వానాకాలం నేపథ్యంలో వరుసగా కురుస్తున్న వర్షాలకు సూరారం పెద్ద చెరువు పూర్తిగా నిండి పొంగిపొర్లి వోక్షిత్ కాలనీ నీట మునిగింది. బండ్లగూడ చెరువు, నాగోల్ చెరువు, హయత్ నగర్ బాతుల చెరువు, కుమ్మరి కుంట, మన్సూరాబాద్ పెద్ద చెరువు, కుత్బుల్లాపూర్‌లోని ఫాక్స్ సాగర్, గాజుల రామారం పర్కి చెరువులు నిండిపోయాయి. ఇప్పటికే సిటీలో 40 చెరువులు ఫుల్ ట్యాంక్ లెవెల్‌కు చేరాయి. కుమ్మరి కుంట కట్ట తెగే ప్రమాదముంది. దిగువ ప్రాంతాలైన అంబేద్కర్ నగర్, లేబర్ బస్తీ, బంజారాకాలనీల్లోకి నీరు చేరుతుంది. పూర్తిగా నిండితే బ్యాక్ వాటర్ అంతా పద్మావతి కాలనీని చుట్టుముడుతుంది. బండ్లగూడ చెరువు బ్యాక్ వాటర్ తో అయ్యప్పకాలనీకి ముంపు పొంచి ఉంది.
ఇలా చెరువులు నిండుతుండగా బయటకు వరదనీరు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతోనే ముంపు ఇబ్బందులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. మళ్లీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల నిర్వహణను బల్దియా పట్టించుకోవడంలేదు. ఇప్పటికే కురిసిన వర్షాలకు చాలాచోట్ల చెరువులు ఫుల్‌అయ్యాయి. మళ్లీ వరద చేరితే నీరంతా బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. గతేడాదికి ప్రస్తుతానికి ఎలాంటి తేడా కనిపించడంలేదు. ఎప్పుడు కూడా ఎఫ్ టీఎల్కి రెండు, మూడు ఫీట్లలోపు నీటిని మెయింటెన్ చేస్తామని అధికారులు చెప్పినా పట్టించుకోలేదు. అవసరమైన చోట మోటర్లను పెట్టి తోడేస్తామని పేర్కొన్నా మరిచిపోయారు. వర్షాల సమయంలో తమ పరిధిలోని చెరువుల వద్ద మోటార్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సైతం మేయర్ ని కోరారు.
ఎఫ్టీఎల్ హద్దులు తేల్చలే..
సిటీలో చెరువుల పరిరక్షణనైతే ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. గతంలో భారీ వర్షాలు పడ్డప్పుడు చాలావరకు చెరువులు కాలనీలను, బస్తీలను ముంచేశాయి. దీంతో ఎఫ్టీఎల్హద్దులను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఏండ్లు గడుస్తున్నా కూడా పనులు పూర్తి చేయడం లేదు. హెచ్ఎండీఎ ఆధ్వర్యంలోని లేక్ ప్రొటెక్షన్ కమిటీ అన్ని చెరువులను ఎఫ్టీఎల్ సర్వే చేసింది. సిటీలో మొత్తం185 చెరువులు ఉండగా, ఇందులో157 చెరువుల ఎఫ్టీఎల్ హద్దులను గుర్తించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 52 చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ పూర్తయింది. వాటికే ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మిగతా వాటిపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వచ్చాయంటూ పక్కన పెట్టేశారు. దీంతో చెరువుల పరిరక్షణ పక్కన పడింది. వర్షాలు కురిసిన ప్రతిఏటా చెరువులు నిండి సమీప కాలనీలు, బస్తీలను ముంచడం పరిపాటిగా మారింది.
గుర్తింపు ఆలస్యమే..
105 చెరువులకు సంబంధించి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఆ చెరువుల ఎఫ్టీఎల్హద్దుల ఫైనల్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తమవే భూములంటూ కొందరి నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. వీరి నుంచి అభ్యంతరాలు వస్తుండగా.. అధికారులు 105 చెరువులపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. 2020 అక్టోబర్‌లో వచ్చిన వరదలతో నగరం ఒక్కసారిగా విలవిలలాడింది. 500లకుపైగా కాలనీలు వారాలపాటు ముంపులోనే ఉండిపోగా స్థానికులు ఇబ్బందులు పడ్డారు. టోలిచౌకి నదీంకాలనీ, చాంద్రాయణగుట్ట అల్ జుబైర్ కాలనీలతో పాటు అనేక ప్రాంతాల్లో 10 ఫీట్ల లోతు వరద నీరు నిలిచి స్థానికులు అవస్థలు పడ్డారు.
రూ.481 కోట్లు ఖర్చు
చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు, మురుగు నీటి మళ్లింపు, వాకింగ్ ట్రాక్, ఎలక్ట్రికల్ లైటింగ్ తదితర సౌకర్యాల పనులకు బల్దియా రూ.481 కోట్లు ఖర్చు చేసింది. రెండేళ్ల కింద ఎమర్జెన్సీ మరమ్మతులకు రూ.9.42 కోట్లు, 63 చెరువుల వద్ద రూ.94.17 కోట్లతో వివిధ పనులను చేపట్టింది. మిషన్ కాకతీయ నిధులతో రూ.282 కోట్లతో19 చెరువుల పనులు చేపట్టారు. గతేడాది రూ.95.54 కోట్లతో 61 చెరువులకు వెళ్లే రోడ్లను బాగు చేసేందుకు బల్దియా ఖర్చు చేస్తుందని చెప్పినా ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇలా విడతల వారీగా వందలాది కోట్లు ఖర్చు పెడుతున్నా కూడా పరిస్థితిలో మార్పులేదు. మెయిన్ రోడ్లపై ఉన్న ఒకటి, రెండు మినహా ఏ చెరువు వద్దకెళ్లి చూసినా కూడా సరైన సదుపాయాలు కనిపించవు. తమ ప్రాంతంలోని చెరువులను కాపాడాలంటూ బల్దియాకు నిత్యం ఫిర్యాదులు అందుతున్నాయి.
ఎప్పటికప్పుడు మానిటరింగ్
వానాకాలంలో చెరువులు నిండుతుండగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు బల్దియా అధికారులు నిర్ణయించారు. ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నారు. ఇటీవల కమిషనర్ రోనాల్డ్ రోస్ చెరువులను పరిశీలించారు. భారీ వానలకు చెరువులు నిండి పొంగిపొర్లితే.. ఏం చేయాలని దానిపై అధికారులతో మీటింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి వానలు పడేటప్పుడే హడావుడి చేయకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చేవి కావు. కానీ, అధికారులు అలా వ్యవహరిస్తే సమస్యలు ఎందుకు వస్తాయని జనం ప్రశ్నిస్తున్నారు.