
హనుమకొండ, వెలుగు: కాలంతో సంబంధం లేకుండా వర్షం పడితే చాలు గ్రేటర్ వరంగల్ నగరంలో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరి జనాలు ఇబ్బందులు పడుతున్నారు. మూడేండ్ల కిందట కురిసిన వర్షాలకు నగరం నీట మునిగింది. వరద నీటి డైనేజీ సిస్టమ్లో లోపాలెన్నో బయటపడ్డాయి. అప్పటికప్పుడు ఓరుగల్లు ముంపు నివారణకు ప్రభుత్వం రూ.250 కోట్లు సాంక్షన్ చేసి మరిచిపోయింది. ఆ తర్వాత నిధులను విడుదల చేయకపోవడంతో నాలాల డెవలప్మెంట్, ఇతర పనుల కోసం ఆఫీసర్లు పంపిన ప్రతిపాదనలు కాగితాల్లోనే మూలుగుతున్నాయి. నిధుల కొరతతో ప్రధాన కాల్వలు రిపేర్లకు నోచుకోవడం లేదు. దీంతో కొద్దిపాటి వానకే కాలనీల్లోకి నీళ్లు చేరుతున్నాయి. వానకాలం అని కాకుండా అకాల వర్షాలు కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి ఎదురవుతోంది.
నాలాల పరిస్థితి మారలే
వరంగల్ నగరంలో వరద నీటి ప్రవాహానికి ముఖ్యమైన బొందివాగు, నయీంనగర్, భద్రకాళి నాలాలు అస్తవ్యస్థంగా మారాయి. వర్షాలు పడినప్పుడు తిమ్మాపూర్, కొండపర్తి, రంగశాయిపేట బెస్తం చెరువుతో పాటు మరోవైపు నుంచి భట్టుపల్లి, అమ్మవారిపేట నుంచి ఉర్సు రంగ సముద్రం చెరువుకు చేరుతున్న నీళ్లు బొందివాగు నాలా గుండా భద్రకాళి నాలా వైపు వెళ్లాల్సి ఉంది. అయితే ఉర్సు రంగసముద్రం నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఉన్న బొందివాగు నాలా ఆక్రమణలతో కుచించుకుపోయింది. గుర్రపుడెక్క, పూడికతో నిండిపోయింది.
హనుమకొండలో ప్రధానమైన నయీంనగర్ నాలా పరిస్థితి ఇలాగే ఉంది. 2020 ఆగస్టులో వచ్చిన వరదలతో వరంగల్ నగరం నీట మునగగా.. మంత్రి కేటీఆర్ స్వయంగా పరిశీలించారు. గతంలో ఏర్పాటు చేసిన నాలాలు ప్రస్తుత అవసరాలకు సరిపడా లేవని, వరద ప్రవాహాన్ని అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ప్రతిపాదనలు రెడీ చేయాలని ఆదేశించారు. బొందివాగు నాలా సమస్య తీవ్రంగా ఉండటంతో ఇరిగేషన్ ఆఫీసర్లు రిటైనింగ్ వాల్, రెండు చోట్ల గేట్లు, తదితర పనులకు రూ.158 కోట్లతో ప్రపోజల్స్ పంపించారు. ప్రతిపాదనలు పంపించి ఏండ్లు గడుస్తున్నా ఇంతవరకు వాటికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. ఇక నయీంనగర్ నాలా పొడవునా రిటైనింగ్ వాల్స్ నిర్మించాల్సి ఉండగా.. ప్రెసిడెన్సీ స్కూల్ వరకు కట్టారు. ఫండ్స్ కొరత కారణంగా మిగతా పనులు షురూ కాలేదు.
250 కోట్లు ఇంతవరకు రాలే
2020 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు నగరంలో చాలా చోట్ల రోడ్లు, డ్రైనేజీలు, నాలాలు దెబ్బతిన్నాయి. మంత్రి కేటీఆర్, స్థానిక మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, జిల్లాకు చెందిన నేతలు ఓరుగల్లు నగరంలో పర్యటించారు. వరద నివారణతో పాటు వివిధ పనుల కోసం రూ.250 కోట్లు కేటాయించారు. ఇది జరిగి వచ్చే ఆగస్టుకు మూడేండ్లు అవుతుండగా.. ఇంతవరకైతే పైసా రిలీజ్ చేయలేదు. హనుమకొండలో వడ్డేపల్లి చెరువు క్యాచ్ మెంట్ పరిధిలో వరదలు ముంచెత్తడంతో నిరుడు ఫిబ్రవరిలో స్మార్ట్ సిటీ ఫండ్స్ రూ.54 కోట్ల అంచనా వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు స్టార్ట్ చేశారు. ఆ పనులు ఏడాది దాటినా పూర్తి కాలేదు. ఇక ఇంటర్నల్ డ్రైనేజీ సిస్టమ్ లో కూడా చాలా సమస్యలున్నాయి.
అకాల వానలకు వణుకుడే
అయిదారు రోజుల కిందట కురిసిన వానలకు హనుమకొండ అంబేడ్కర్ భవన్ జంక్షన్, అశోకకాలనీ, అలంకార్, ఉజిలిబేస్, కాకతీయ కాలనీ, న్యూరాయపుర తదితర కాలనీల్లోకి వరద, మురుగునీరు పోటెత్తగా.. రెండ్రోజుల కిందట వరంగల్ చౌరస్తా, పాత బీట్ బజార్ ఏరియాలో సైతం మురుగునీరు రోడ్లపై నిలిచి జనాలు ఇబ్బందులు పడ్డారు. చిన్న వాన పడినా నగరంలో చాలాచోట్ల ఇదే పరిస్థితి తలెత్తుతుండగా.. ఇంటర్నల్ డ్రైన్ సిస్టమ్ సరిగా లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతోనే వర్షాకాలం ఎదురయ్యే పరిస్థితి తలెత్తుతోంది. గ్రేటర్ వరంగల్ ప్రజలు ఎండాకాలంలోనే చూస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని ఎస్సార్ నగర్, సాయిగణేశ్ కాలనీ, ఎన్టీఆర్ నగర్, బీఆర్ నగర్, కాశీకుంట తదితర ప్రాంతాలు చిన్నపాటి వానకే ఎఫెక్ట్ అవుతుండగా.. అక్కడ శాశ్వత ప్రాతిపదికన చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఎండాకాలంలో కురిసే వానలకు కూడా గ్రేటర్ జనాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పుడే ఇలాఉంటే వర్షాకాలం మొదలైతే పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇకనైనా గ్రేటర్ పరిధిలోని లీడర్లు, ఆఫీసర్లు కాలనీలు ముంపునకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.