ఇది కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్లకు వెళ్లే మెయిన్ రోడ్డు. కరీంనగర్, రాజన్న సిరిసిల్లా, సిద్దిపేట జిల్లాలకు ఈ రోడ్డు మీదే వెళ్తుంటారు. వేల సంఖ్యలో వెహికల్స్ తిరుగుతుంటాయి. పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ఎల్లమ్మ గుడి వరకు రోడ్డుకు ఇరువైపులా కిలో మీటర్ వరకు ఈ రోడ్డు అధ్వానంగా మారింది. పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసన వర్షాలకు గుంతల్లో నీళ్లు నిలిచాయి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పర్మినెంట్గా రిపేర్లకు చర్యలు తీసుకోవాల్సిన ఆర్అండ్బీ శాఖ అప్పుడప్పుడు టెంపరరీగా మట్టి పోసి చేతులు దులుపుకుంటోంది.
కామారెడ్డి , వెలుగు: వానలు కురిసినప్పుడల్లా ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. క్వాలిటీ పాటించకుండా రోడ్లు వేయడంతో చిన్నపాటి వానకే గుంతలు పడుతున్నాయి. కోట్లు ఖర్చు చేసి పనులు చేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్లపై అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. టౌన్లో ఆర్అండ్బీతో పాటు మున్సిపల్ రోడ్లు ఉన్నాయి. మెయిన్ రోడ్లతో పాటు.. ఇంటర్నల్, కాలనీల రోడ్లు అధ్వానంగా మారాయి. కోట్లాది రూపాయల నిధులతో నిర్మిస్తున్న రోడ్లు కొన్నాళ్లకే చెడిపోతున్నాయి. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణికులు నరకం చూడాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలో వేలాది వెహికల్స్ రోడ్లపై తిరుగుతుంటాయి. మెయిన్ రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రయాణం కష్టమవుతున్నా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్డు, హైస్కూల్ రోడ్డు, పాత బస్టాండు నుంచి రైల్వే గేట్ వరకు, విద్యానగర్కాలనీలోని జన్మభూమి రోడ్లు, ఆశోక్నగర్ కాలనీ మెయిన్ రోడ్డు, రైల్వే గేట్ ఏరియా, సైలాన్బాబా కాలనీ, జయశంకర్ కాలనీ రోడ్లు అధ్వానంగా మారాయి. బీటీ కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. పలు చోట్ల కంకర తేలింది.
రోడ్ల పైనే నీళ్లు..
స్టేషన్, సిరిసిల్ల, జేపీఎన్, సుభాష్రోడ్లలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. దశాబ్ధాల క్రితం నిర్మించిన డ్రైనేజీలు మూసుకుపోయాయి. దీంతో వానకాలంలో రోడ్లపైనే నీళ్లు నిలుస్తున్నాయి. నిత్యం వెహికల్స్ రాకపోకలతో రద్దీగా ఉండే మెయిన్ రోడ్లపై గుంతలు పడడం, నీళ్లు నిల్వడంతో జనానికి ఇబ్బంది కలుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వానలకు రోడ్లపై భారీగా నీళ్లు నిలిచాయి. రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీల నిర్మాణానికి ఫండ్స్ శాంక్షన్ అయినప్పటికీ నిర్మాణం విషయంలో యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో పలు ఏరియాల్లో రెండేళ్ల కాలంలో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.5 కోట్ల వరకు మున్సిపల్ జనరల్ ఫండ్స్, ఇతర గ్రాంట్లు ఖర్చు చేశారు. రోడ్ల నిర్మాణం చేసేటప్పుడు నాణ్యత లేకుండా వర్క్స్ చేయడంతో కొన్నాళ్లకే శిథిలమవుతున్నాయి.
రిపేర్లు చేయిస్తాం
దెబ్బతిన్న రోడ్లను రిపేర్లు చేయిస్తాం. కొన్ని చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. వాటిని ఎప్పటికప్పుడు రిపేర్ చేయిస్తున్నాం. డ్రైనేజీల నిర్మాణం కూడా త్వరలో చేపడుతాం. - దేవేందర్, మున్సిపల్ కమిషనర్