‘పుష్ప’లో పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకున్న రష్మిక.. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో మోడర్న్ గాళ్‌గా కనిపించబోతోంది. ఈ మూవీ మార్చి 4న రిలీజవుతున్న సందర్భంగా కాసేపు ఇలా ముచ్చటించింది.
‘‘ఇందులో నేను ఆద్య అనే స్ట్రెయిట్ ఫార్వార్డ్ అమ్మాయిగా కనిపిస్తాను. ఫస్ట్ లాక్‌డౌన్ టైమ్‌లో ఈ స్క్రిప్ట్ విన్నాను. చాలా నచ్చింది. ఆడవాళ్లకి ఇంపార్టెన్స్ ఉండే సినిమా అని చెప్పడంతో పాటు ఖుష్బూ, రాధిక, ఊర్వశి లాంటి సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నారనడంతో హ్యాపీగా ఫీలయ్యాను. ఇంటర్వెల్ సీన్ విన్నాకయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు చేస్తానా అని ఎక్సైటయ్యాను. ‘పుష్ప’ తర్వాత ఈ సెట్‌లోకి వస్తే పిక్నిక్‌లా ఉండేది. ఎక్కువ మంది ఆడవాళ్లు ఉండటంతో సెట్ అంతా చాలా కలర్‌ఫుల్‌గా కనిపించేది.
డైరెక్టర్ కిశోర్ ఆడవాళ్లకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కమర్షియల్ సినిమాలు వస్తున్న ఈ టైమ్‌లో మహిళల కోసం ఆయన ప్రత్యేకంగా ఓ సినిమా చేయడం గొప్ప విషయం. డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశారు. ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చుని ఎలా మాట్లాడుకుంటామో సినిమాలోనూ అలాగే ఉంటుంది. శర్వానంద్ చాలా కూల్. తనని ఆడవాళ్లంతా సినిమాలో టార్చర్ పెడతారు. ఇదంతా చాలా ఫన్నీగా ఉంటుంది. దేవి ఇచ్చిన ఆల్బమ్‌కి ఇప్పటికే మంచి రెస్సాన్స్ వచ్చింది. బ్యాగ్రౌండ్ స్కోరు కూడా ఆకట్టుకుంటుంది.
పెద్ద స్టార్ కాస్ట్‌తో తీసినా ఎవరికీ ఏ ఇబ్బందీ రాకుండా చూసుకున్నారు ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి. ఈ బ్యానర్‌లో మరో సినిమా చేయాలనుంది. ఇక ‘పుష్ప2’తో పాటు కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా లైన్‌లో ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్‌మెంట్స్ వస్తాయి. నాకైతే యాక్షన్, హిస్టారికల్ మూవీస్‌తో పాటు బయోపిక్స్ చేయాలనుంది. ఈమధ్య నా పెళ్లి మీద చాలా రూమర్స్ వచ్చాయి. అవేవీ నిజాలు కావు. నా పెళ్లికి ఇంకా టైమ్ ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు చేసుకుంటాను.’’