ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోయర్ మానేరు డ్యాంకి ఫుల్ వరద

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోయర్ మానేరు డ్యాంకి ఫుల్ వరద

రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వీధులన్నీ జలమయం అయ్యాయి. మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల్లో డ్రైనేజీలు, రోడ్లు పొంగిపొర్లుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకదాటిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో మందమర్రి, శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాల్లోని ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కళ్యాణి ఖని, ఇందారం, శ్రీరాంపూర్, ఆర్కే ఓపెన్ కాస్ట్ గనులలోకి వర్షపు నీరు చేరడంతో ఓబీ పనులు నిలిచిపోయాయి. 

Also Read :- అందుబాటులోకి అదిరిపోయే 2 కొత్త రీఛార్జ్ ప్లాన్స్

మంచిర్యాల సూర్యనగర్ లో ఇళ్లలోకి వరదనీరు చేరి.. నాళాలు పొంగి ప్రవహిస్తున్నాయి. కల్వర్టుపై నుంచి నీరు ప్రవహిస్తూండటంతో  రాకపోగాలకు ఇబ్బందిగా ఉంది. అటు ఉమ్మడి కరీనగర్ జిల్లాలో కూడా బుధవారం ఉదయం భారీ వర్షాలు దంచికొట్టాయి. మోయతుమ్మెద వాగు ద్వారా కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలోకి సుమారు 40 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

సిద్దిపేట జిల్లా బెజ్జంకి, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలాల మధ్య దేవక్కపల్లి దగ్గర మోయ తుమ్మెద వాగు, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఎల్లమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హుస్నాబాద్, అక్బర్ పేటలో కుండపోత వర్షం. భూంపల్లి మండలం ఖాజీపూర్ గ్రామాంలో గత రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు కూలిపోయి దారం కంసలీయ (90 )అనే వృద్ధురాలికి గాయాలు అయ్యాయి. ఇందుర్తి, కోహెడ మెయిన్ రోడ్డుపై రాకపోకులకు అంతరాయం ఏర్పడింది.