ధరణిలో సర్వే నంబర్లన్నీ ఆగమాగం

  • ధరణి పేరుతో రైతులను తిప్పలు పెట్టిన్రు
  • సర్వే శాఖతో సంబంధం లేకుండానే పోర్టల్ తెచ్చిన్రు 
  • ఖాస్రా, సెసలా పహాణీలేవీ అప్ లోడ్ చేయలేదు
  • వక్ఫ్, దేవాదాయ భూముల్లో 40 శాతం నమోదు కాలేదు 
  • గుర్తించిన ధరణి కమిటీ.. వక్ఫ్, దేవాదాయ, సర్వే శాఖలతో సమావేశం

హైదరాబాద్, వెలుగు:  సర్వే అండ్ సెటిల్​మెంట్ శాఖతో సంబంధం లేకుండానే ధరణి పోర్టల్​లో భూలావాదేవీలు జరుగుతున్నాయని ధరణి కమిటీ గుర్తించింది. అసలు పాత రికార్డులేవీ లేకుండానే ధరణి పోర్టల్​ను నిర్వహిస్తున్నట్టు తెలుసుకుంది. భూరికార్డుల్లో ముఖ్యమైన ఖాస్రా, సెసలా ప‌హాణీ రికార్డులన్నింటినీ ఇప్పటికీ మాన్యువల్​గానే పెట్టారని, ధరణిలో ఎక్కడా అప్​లోడ్​ చేయలేదని గుర్తించింది. దీంతో ఫీల్డ్ లోని భూములకు, ధరణిలో నమోదైన భూములకు మధ్య భారీగా తేడాలు ఉన్నట్టు తెలుసుకుంది. శనివారం సెక్రటేరియెట్​లో సర్వే అండ్ సెటిల్​మెంట్, వక్ఫ్, దేవాదాయ శాఖల అధికారులతో సీసీఎల్ఏ నవీన్​మిట్టల్ నేతృత్వంలోని ధరణి కమిటీ సమావేశమైంది. 


పోర్టల్​లోని సమస్యలపై దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా అనేక అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నది. ప్రధానంగా భూములు అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినప్పుడు సర్వే నెంబర్, హద్దులు, బై సర్వే నెంబర్లు వంటివి తప్పనిసరి. సాధారణంగా ఒక సర్వే నెంబర్​లో 20 కంటే ఎక్కువ బై నెంబర్లు ఉండవు. కానీ ధరణి వచ్చాక ఒక్కో సర్వే నెంబర్​లో ఏకంగా 250 నుంచి 300 దాకా బై నెంబర్లు నమోదైనట్టు గుర్తించారు. దీంతో సర్వే అండ్​సెటిల్​మెంట్ శాఖను ధరణికి ఎలా లింకప్​చేయాలనే దానిపై చర్చించారు. దీనిపై ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించారు. ఇక భూములకు సంబంధించి ఖాస్రా, సెసలా పహాణీలు చాలా ముఖ్యమైనవి. కానీ వీటిని ధరణి పోర్టల్​లో అప్​లోడ్​చేయలేదు. ఇప్పుడు వీటిని ధరణిలో ఎలా ఎంట్రీ చేయాలనే దానిపై చర్చించారు. స‌ర్వే మ్యాప్‌ల ప్రస్తుత స్థితి, ధ‌ర‌ణి పోర్టల్ లోని స‌మాచారానికి, ఈ మ్యాప్‌ల‌కు మ‌ధ్య వ్యత్సాసం ఉందా? అనే దానిపైనా వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూభార‌తి కార్యక్రమం సక్సెస్​అయినప్పటికీ, ఎందుకు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందనే దానిపైనా చర్చించారు.  

దేవాదాయ భూములు 40 వేల ఎకరాలు ఎక్కలే..  

వక్ఫ్, దేవాదాయ శాఖలకు సంబంధించిన భూములపై ధరణి కమిటీ చర్చించింది. ఈ రెండు శాఖలకు సంబంధించి దాదాపు 40 శాతం భూములు ధరణిలో నమోదు కాలేదని గుర్తించింది. రాష్ట్రంలో దేవాదాయ శాఖ కింద దాదాపు 90 వేల ఎకరాలు ఉండగా, అందులో50 వేల ఎకరాలు మాత్రమే ధరణిలో నమోదైంది. వక్ఫ్ భూములదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ సరిచేయాలని కమిటీ నిర్ణయించింది. వ‌క్ఫ్ బోర్డు కింద ఉన్న మొత్తం భూమి ఎంత? అందులో ఎంత కబ్జాలకు గురైంది? ఉన్న భూములను రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తదితర వివరాలను అడిగి తెలుసుకుంది. అలాగే దేవాదాయ శాఖ భూముల వివరాలపైనా ఆరా తీసింది. ఈ సమావేశంలో ధరణి కమిటీ సభ్యులు కోదండ‌రెడ్డి, రేమండ్ పీటర్, భూమి సునీల్ కుమార్, మధుసూదన్, సీఎంఆర్ఓ వి.లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.