కామారెడ్డిలో తలపడిన ముగ్గురు నేతలూ అసెంబ్లీకి!

  • అసెంబ్లీ ఎన్నికల్లో టాక్​
  • ఆఫ్​ది సెగ్మెంట్​గా  కామారెడ్డి

కామారెడ్డి​, వెలుగు: ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కనీ, విని ఎరగని వింత చోటుచేసుకుంది. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి తలపడిన ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెడుతుండడమే ఆ విశేషం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ నుంచి మాజీ సీఎం కే చంద్రశేఖర్​ రావు, కాంగ్రెస్​ నుంచి కాబోయే సీఎం రేవంత్​రెడ్డి పోటీ చేయగా,  బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి బరిలో నిలిచారు. కాగా, త్రిముఖ పోరులో స్థానికుడైన వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అయితే, కామారెడ్డితో పాటు రేవంత్​రెడ్డి  కొడంగల్​లో, కేసీఆర్​ గజ్వేల్​లో పోటీచేసి గెలవడంతో ఆ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి కాస్తా టాక్ ​ఆఫ్ ​ది సెగ్మెంట్​గా మారింది.  సీఎం, కాబోయే  సీఎం ఇద్దరినీ ఓడించిన వెంకటరమణారెడ్డి పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. మూడు రోజులుగా  వెంకటరమణా రెడ్డికి దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.