గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో అన్ని పనులు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే చెత్త సేకరణ, డంపింగ్ యార్డులకు తరలించడం పనులతో పాటు రోడ్ల నిర్మాణం.. వాటి నిర్వహణ.. రోడ్ల క్లీనింగ్ ఇలా అన్ని పనులు ప్రైవేట్ వ్యక్తులే చేస్తున్నారు. పేరుకే బల్దియా ప్రభుత్వ కార్పొరేషన్... కానీ ఇందులో పనులు చేసేవారంతా ప్రైవేట్ వారే. తాజాగా మరికొన్ని స్వీపింగ్ మెషిన్లు ప్రైవేట్ కు అప్పగించే యోచనలో ఉంది బల్దియా. గ్రేటర్ మహానగర పాలక సంస్థ పాలకమండలి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అద్దెలు చెల్లించడానికే బల్దియా ప్రాధాన్యం ఇస్తోందనే ఆరోపణలున్నాయి. సొంత వనరులను పక్కన పెట్టి ప్రైవేట్ సంస్థల సేవల కోసం అధికారులు పరితపిస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా నిర్వహణ, ఇతర బాధ్యతల నుంచి బల్దియాను తప్పించేందుకు యంత్రాంగం ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే చెత్త తరలింపు, నిల్వ, నిర్వహణ, సెకండరీ కలెక్షన్ ఇలా బాధ్యతలన్నీ బల్దియా పెద్దలు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు.
ప్రధాన రహదారుల స్వీపింగ్ కూడా అద్దె యంత్రాలతోనే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు వినియోగంలో ఉన్న సంస్థకు చెందిన వాహనాలను తొలగించి.. మరిన్ని అద్దె యంత్రాలు తీసుకోవాలని ఇటీవల నిర్ణయించారు. ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ కోసం కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని చెప్తున్నా... కొందరు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో కావాల్సిన ఏజెన్సీలనే ఎంపిక చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
గ్రేటర్ పరిధిలోని ప్రధాన రహదారులను రాత్రి పూట యంత్రాలతో శుభ్రం ( స్వీపింగ్) చేస్తుంటారు. జీహెచ్ఎంసీకి సంబంధించి 5 పెద్ద స్వీపింగ్ యంత్రాలు, 12 చిన్న మిషన్లు ఉన్నాయి. మరో 18 యంత్రాలు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. మూడేళ్ల కాల వ్యవధిలో యేడాదిన్నర క్రితం ఈ వాహనాల అద్దె ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు ఏటా 35 కోట్లు ఖర్చువుతోంది. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించిన 820 కిలోమీటర్ల రోడ్లపై స్వీపింగ్ బాధ్యతలు ఆయా సంస్థలకే అప్పగించారు. సదరు ఏజెన్సీలే యంత్రాలను ఏర్పాటు చేసి స్వీపింగ్ చేస్తున్నాయి. కాలనీలు, బస్తీల్లోని రోడ్లను కార్మికులు ఊడుస్తుండగా.. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన రహదారులపై యంత్రాలతో స్వీపింగ్ చేస్తున్నారు.
రాత్రి పూట కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారనే కారణంతో మిషన్ల వినియోగం మొదలు పెట్టారు. సంస్థకు చెందిన స్వీపింగ్ యంత్రాలు కాలం చెల్లాయంటూ స్ర్కాప్ గా అమ్మాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాటి స్థానంలో కొత్త అద్దె వాహనాల కోసం త్వరలో టెండర్ నోటిఫికేషన్ ఇస్తారని తెలుస్తోంది. గతంలో చెత్త తరలింపు వాహనాలను తొలగించి.. అద్దె బండ్లను వినియోగించారు. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అధికారులకు కావాల్సిన, గత పాలకమండలి సభ్యుల్లో కొందరి బినామీలకు చెందిన వాహనాలను అద్దెకు నడిపించారన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం వినియోగిస్తోన్న స్వీపింగ్ యంత్రాలూ.. అధికారుల అండదండలున్న వారివేనన్నది అందరికీ తెలిసిన విషయమే.
ప్రస్తుతం రాత్రి పూట తిరుగుతున్న ఏ స్వీపింగ్ మిషన్ కూడా సరిగా పని చేయడం లేదు. ఒక్కో మిషన్ కు 4 బుష్ లు ఉండగా... అందులో ఒకటీ, రెండే పనిచేస్తాయి. గంటకు 6 కిలోమీటర్ల చొప్పున రోజుకు 60 కిలోమీటర్ల వరకు స్వీపింగ్ చేయాలి. కానీ చాలా మెషిన్లు 30 నుంచి 40 కిలోమీటర్లకి మించి రోడ్లు ఊడవడం లేదు. అయినా పట్టించుకోని ఉన్నతాధికారులు... నెలకు మాత్రం బిల్లులు చెల్లిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ పర్యవేక్షించే కొందరు ఏఎంఓహెచ్ లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు యంత్రాల పని తీరును సర్టిఫై చేస్తున్నారు.
పూర్తిస్థాయి బిల్లు వచ్చేలా సహకరిస్తున్న వారికి ఎవరి స్థాయిలో వాళ్లకి వాటాలు దక్కుతున్నట్టు టాక్. మరిన్ని యంత్రాలు అద్దెకు తీసుకుంటే ఏటా ఖర్చు 40 కోట్లకు పెరగనుంది. స్వీపింగ్ యంత్రాలు సరిగా పని చేస్తున్నాయా..? లేదా..? అన్నది పర్యవేక్షించేందుకు సెన్సార్లు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. ఏజెన్సీలు ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో ఆ ప్రతిపాదన పక్కకు వెళ్లింది. దీంతో యంత్రాలు తిరిగినవే కిలోమీలు.. ఊడ్చినవే రోడ్లు అన్నట్టుగా పరిస్థితి తయారైందనే విమర్శలున్నాయి.