కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఆ నలుగురు..!
మొన్న ఖమ్మంలో బీఆర్ఎస్ మీటింగ్ కు హాజరు
ఇవాళ పాట్నా మీటింగ్ లోనూ ప్రత్యక్షం
నితీశ్ సమావేశానికి అఖిలేశ్, కేజ్రీవాల్ హాజరు
ప్రతిపక్షాల మీటింగ్ కు వెళ్లని సీఎం కేసీఆర్
సమావేశానికి దూరంగా ఉన్న ఎంఐఎం
ఏపీ నుంచి వైఎస్సార్ సీపీ, టీడీపీ గైర్హాజరు
కేసీఆర్ మిత్రులు క్రమంగా దూరమవుతున్నారు.. వెన్నంటి ఉంటామని భరోసా ఇచ్చిన వాళ్లంతా వెనుదిరిగి చూడకుండా వెళ్లిపోతున్నారు. మొన్న జేడీఎస్ అధినేత కుమారస్వామి దూరమైన విషయం తెలిసిందే. శుక్రవారం (జూన్ 23న) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పాట్నాలో నితీశ్ కుమార్ నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశానికి హాజరయ్యారు. పార్టీల పరంగా ఆప్, జేఎంఎం, సీపీఐ, సీపీఎం, జేడీఎస్, ఎస్పీ కేసీఆర్ కు దూరమయ్యాయని ఈ సమావేశంతో స్పష్టమైంది. ఈ మీటింగ్ కు సీఎం కేసీఆర్ కు, ఏపీ సీఎం జగన్ కు, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందలేదని సమాచారం.
హైదరాబాద్ : జాతీయ స్థాయిలో తన మిత్రపక్షాలుగా సీఎం కేసీఆర్ ప్రచారం చేసుకున్న వాళ్లంతా క్రమంగా దూరమవుతున్నారు. పార్టీ ఆవిర్భావం పేరుతో తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశానికి హాజరైన జేడీఎస్ అధినేత కుమార స్వామి ఆ తర్వాత జరిగిన ఖమ్మం సభలో కనిపించలేదు. మొన్న ఖమ్మం సభలో పాల్గొన్న ఆప్, సమాజ్ వాదీ, సీపీఐ, సీపీఎం, పార్టీలు ఇవాళ నితీశ్ కుమార్ ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ వెళ్లలేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జనతాదళ్ సెక్యూలర్ కీలక నేత కుమారస్వామి, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్లకు ఆహ్వానం పంపలేదని జనతాదళ్ యూనియన్ అధికార ప్రతినిధి కేసీ త్యాగి చెబుతున్నారు. సీఎం కేసీఆర్ తన వెంట ఉన్నారని భావిస్తున్నవారంతా క్రమంగా దూరమవుతుండటం చర్చనీయాంశంగా మారింది.
ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం నేత విజయన్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, సీపీఐ నాయకుడు డీ రాజా, కేసీఆర్ మరో మిత్రుడు జార్ఖండ్ ముక్తి మోర్చా నేత, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ తదితరులు హాజరయ్యారు. ఆ తర్వాత కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామంటే వచ్చామని, తమకు ఇది రాజకీయ సమావేశమని తెలియదని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.
కొన్నాళ్లు దూరం పాటించిన కేజ్రీవాల్ లిక్కర్ స్కాం కేసుల నేపథ్యంలో కేసీఆర్ కు కాస్తా దగ్గరయ్యారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చి ఢిల్లీ పాలనలో ఎల్జీ జోక్యంపై పార్లమెంటు వేదికగా పోరాడేందుకు మద్దతివ్వాలని కేసీఆర్ ను కోరారు. తర్వాత స్పందించిన కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గవర్నర్ల జోక్యంపైనా మాట్లాడారు. తమ మద్దతు ఉంటుందని చెప్పారు. అదే కేజ్రీవాల్ ఇవాళ పాట్నాలో బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవటం గమనార్హం.
ఇంతకూ కేజ్రీవాల్ కు చెందిన ఆప్ బీఆర్ఎస్ కు మిత్రపక్షమా.. లేక కాంగ్రెస్ పక్షమా..? అన్న చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ మరో మిత్ర పక్షం ఎంఐఎం కు కూడా కొత్తగా ఆవిర్భవించనున్న కూటమి నుంచి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ నుంచి ఎవరూ సమావేశానికి వెళ్లలేదు. సీఎం కేసీఆర్ తనకు మిత్ర పక్షాలని, ఆప్త మిత్రులను చెప్పుకుంటున్న వారంతా దూరమవటం గమనార్హం. బీఆర్ఎస్ ను దేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న కేసీఆర్ కు ఇది గట్టి దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ALSOREAD:ఫాంహౌస్ కు రోడ్డేస్కోని పేదల ఇండ్లు ముంచిండు : రేవంత్ రెడ్డి