డబుల్ డిజిట్! .. మూడు పార్టీలదీ అదే ధీమా

డబుల్ డిజిట్! ..  మూడు పార్టీలదీ అదే ధీమా

హైదరాబాద్: హోరాహోరీగా సాగిన పార్లమెంటు ఎన్నికలు రాష్ట్రంలో ముగిశాయి. 17 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడు పార్టీలు ముమ్మరంగా  ప్రచారం చేశాయి. పోలింగ్ ముగిసిన అనంతరం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు ఎవరికి వారు గెలుపు ధీమాలో ఉన్నారు. పార్టీల అధినేతలు పోలింగ్ శాతానికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్టు తెప్పించుకొని లెక్కలు వేసుకుంటున్నారు. ఎప్పటి మాదిరిగానే ఈ సారి గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. పల్లె ఓటరు తమ వైపే  నిలిచాంటూ మూడు పార్టీలు చెబుతున్నాయి. జూన్ 4న జరిగే కౌంటింగ్  రోజు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
 
14 సీట్లు పక్కా అంటున్న సీఎం

ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్  పార్టీకి 14 సీట్లు పక్కాగా వస్తాయని చెబుతున్నారు. ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశామని దాని ప్రభావం ఈ ఎన్నికలపై స్పష్టంగా కనిపించిందని అంటున్నారు.  బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రు. 500 కే మూడు సబ్సిడి సిలిండర్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడకం కారణంగా  మెజారిటీ సీట్లు పక్కా అంటున్నారు. బీఆర్ఎస్ కు ఓట్లేసినా ఉపయోగంలేదని, అలాగే నరేంద్రమోదీ వల్ల తెలంగాణాకు ఎలాంటి మేలు జరగలేదని ప్రజలు అర్ధంచేసుకున్నారని రేవంత్ చెప్పారు. రిజర్వేషన్లు రద్దవుతాయని, రాజ్యాంగాన్ని మారుస్తారంటూ తాను బయటపెట్టిన ఆధారాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో కదలిక తీసుకొచ్చాయంటున్నారు. రుణమాఫీపై తాను ఇచ్చిన హామీని కూడా  రైతులు సంపూర్ణంగా విశ్వసించారంటున్నారు. ఏది ఏమైనా 14 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

8 సీట్లు బోనస్ వస్తాయంటున్న బీజేపీ

గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి నాలుగు ఎంపీ స్థానాలు వచ్చాయని, ఈ సారి మరో ఎనిమిది స్థానాలు పక్కాగా యాడ్ అవుతాయని, మొత్తం 12 స్థానాల్లో బీజేపీ విజయం సాధించబతోందని ఆ పార్టీ నేతలు కిషన్ రెడ్డి, డాక్టర్ కే లక్ష్మణ్​, ఈటల చెబుతున్నారు. ప్రజలు విస్పష్టమైన తీర్పును ఇవ్వబోతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసగించిందని ప్రజలు గ్రహించారని అది తమకు ఓట్లు తెచ్చిపెడుతుందని చెప్పారు. అదేసమయంలో బీఆర్ఎస్ కు ఓట్లేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని కూడా  ప్రజలు గ్రహించారని చెప్పారు. తెలంగాణ అభివృద్ది నరేంద్రమోదీ నాయకత్వంలో మాత్రమే జరుగుతుందన్న విషయాన్ని ప్రజలంతా తెలుసుకున్నారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామీణ ఓటర్లు కూడా ఈ సారి తమ వెంట ఉన్నారంటున్నారు. మోదీ  నాయకత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆహ్వానిస్తున్నారని చెబుతున్నారు.  

14 సీట్లు గెలుస్తమన్న బీఆర్ఎస్

రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించడం లేదని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. ఎక్కడికి వెళ్లినా తాగునీటి సమస్యలు, కరెంటు కోతలు కనిపించాయని, ఈ  ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామనే బాధలో  ప్రజలున్నారని, తమ వ్యతిరేకతను ఈ సారి ఓటు రూపంలో చూపుతారని, బీఆర్ఎస్ 14 సీట్లు సాధిస్తుందని అంటున్నారు. ఆరుగ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిలైందనే విషయం ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారంటున్నారు. అలాగే బీజేపీకి ఓట్లేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని అర్థం చేసుకొన్నారని చెబుతున్నారు. పదేండ్లలో తెలంగాణకు మోదీ ఏమీ ఇవ్వలేదని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించారని తెలిపారు. అందుకే బీఆర్ఎస్ 12 నుంచి 14 సీట్లలో గెలుస్తుందని కాంగ్రెస్, బీజేపీలు రెండోస్ధానం కోసమే పోటీ పడ్డాయని బీఆర్ఎస్ చెబుతోంది. 

21 రోజులు ఆగాల్సిందే..

ఉత్కంఠగా సాగిన పార్లమెంటు ఎన్నికల్లో విజేత ఎవరో తేలాలంటే మరో 21 రోజులు ఆగాల్సిందే. జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత ఓటర్లు ఎవరు  పక్షాన నిలబడ్డారనేది తేలే అవకాశం ఉంది. మూడు పార్టీల గెలుపు ఓటములపై రకరకాల విశ్లేషణలు బయటికి వస్తున్నాయి. ఓట్ల మార్పిడి.. కులాలు, గ్రామాల వారీగా లెక్కలు అన్నింటిపై విశ్లేషణలు కొనసాగుతున్నా అసలు నిజం బయటికి రావాలంటే మరో 21 రోజులు వెయిట్ చేయాల్సిందే.