
- 50 లక్షల ఎకరాలకు చేరువైన వరి
- యాసంగి సాధారణ సాగు 36.43 లక్షల ఎకరాలు
- ఈ సీజన్‌లో ఇప్పటీకే 63.14 లక్షల ఎకరాల్లో సాగైన పంటలు..
- యాసంగి సాధారణ వరిసాగు 22.19 లక్షల ఎకరాలు..
- ఇప్పటికే 49.16 లక్షల ఎకరాల సాగుతో ఆల్‌టైమ్ రికార్డు
- ఇప్పటి వరకు వరి సాగు 45 లక్షల ఎకరాలే రికార్డు
- వానాకాలాన్ని మించిన యాసంగి పంటల సాగు
- టాప్ లో నిజామాబాద్ జిల్లా
హైదరాబాద్, వెలుగు: యాసంగి సాగు ఈ ఏడాది ఆల్‌టైమ్ రికార్డును సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో 63.13 లక్షల ఎకరాలు సాగైంది. వానాకాలంలో కురిసిన భారీ వర్షాలతో చెరువులు, బావుల్లో నీళ్లు నిండిపోయాయి. యాసంగిలో అవసరానికి మించిన నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పంటల సాగు గణనీయంగా పెరిగినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సర్కారు యాసంగి సాగు 60 లక్షల ఎకరాలుగా అంచనా వేయగా ఆ అంచనాలను దాటేసింది.
వరి సాగులో ఆల్‌టైమ్ రికార్డ్
యాసంగిలో వరి సాగు ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ఈయేడు వానాకాలంలో సాగైన 45 లక్షల ఎకరాలే ఇప్పటి వరకు రికార్డు కాగా ఈయేడు యాసంగిలో ఇప్పటికే 49.16 లక్షల ఎకరాల్లో (221.53శాతం) వరి సాగైంది. సాధారణంగా యాసంగి కంటే వానాకాలంలో ఎక్కువ వరి సాగవుతుంది. కానీ దీనికి భిన్నంగా ఈయేడు యాసంగిలో భారీగా వరి పంట సాగు జరిగింది. యాసంగిలో సాధారణ వరి సాగు 22.19 లక్షల ఎకరాలు కాగా నిరుడు యాసంగిలో 26.97 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అదే ఇప్పటి వరకు యాసంగి రికార్డు సాగు. కానీ ఈయేడు యాసంగి రికార్డును చెరిపి వేయడంతోపాటు వానాకాలం వరి సాగు రికార్డును కూడా బద్దలు కొట్టడం గమనార్హం.
రెట్టింపు అయిన యాసంగి పంటల సాగు..
రాష్ట్రంలో యాసంగి సాధారణ సాగు 36.43 లక్షల ఎకరాలు కాగా.. నిరుడు యాసంగిలో 39.84 లక్షల ఎకరాలు సాగైంది. కానీ ఈయేడు ఇప్పటికే 63.13 లక్షల ఎకరాలు సాగైంది. అంటే నిరుడు ఈ టైమ్ కంటే ఇప్పడు దాదాపు రెట్టింపు స్థాయిలో యాసంగి సాగు జరిగింది. ఆహార పంటల సాధారణ సాగు 30.28 లక్షల ఎకరాలు కాగా.. ఈయేడు 59.06 లక్షల ఎకరాల్లో ఫుడ్‌గ్రెయిన్స్ సాగు జరిగింది. వరితోపాటు మొక్కజొన్న, జొన్న పంటలు మెరుగ్గా సాగవడంతో ఫుడ్ గ్రెయిన్స్ 195 శాతం సాగయ్యాయి. ఆయిల్ సీడ్స్ మాత్రమే పూర్తిస్థాయిలో సాగు కాక 89.15 శాతం మాత్రమే పంటలేశారు. ఆముదం, ఆవాలు లాంటి ఆయిల్ సీడ్స్ 2.98 శాతం మాత్రమే వేశారు. పొగాకు 38.76 శాతం మాత్రమే సాగైంది.
ఓవరాల్గా నిజామాబాద్ టాప్..
ఈ యాసంగిలో 4.77 లక్షల ఎకరాల్లో పంటల సాగుతో నిజామాబాద్ జిల్లా టాప్ లో నిలిచింది. ఆ తరువాత నల్గొండ 4.72 లక్షల ఎకరాలతో రెండో స్థానంలో, సూర్యాపేట 4.21లక్షల ఎకరాలతో మూడో స్థానంలో నిలిచాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అత్యల్పంగా 15 వేల ఎకరాల్లోనే సాగైంది.
వరి సాగులో నల్గొండ టాప్
యాసంగి వరి సాగులో నల్గొండ జిల్లా 4.55 లక్షల ఎకరాలతో టాప్‌లో నిలిచింది. సూర్యాపేట జిల్లాలో 4.16 లక్షల ఎకరాలు, నిజామాబాద్ జిల్లాలో 3.74 లక్షల ఎకరాల్లో వరి పంట సాగై తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వరి సాగులో మేడ్చల్ జిల్లాలో అత్యల్పంగా 12,953 ఎకరాల్లో సాగైంది.
ఇవి కూడా చదవండి
పర్మినెంట్ చేయరు.. జీతాలు పెంచరు
తుంగభద్రకు తూట్లు : ఆర్డీఎస్ కుడి కాల్వ తవ్వకానికి రెడీ అయిన ఏపీ
కేసీఆర్ పాలనలో కబ్జాలు.. మాఫియాలు