- సిరిసిల్ల బట్టకు మార్కెట్ లో పడిపోయిన డిమాండ్
- బతుకమ్మ చీరల ఆర్డర్లతో ఆగిన ఇతర ఉత్పత్తులు
- గత సర్కారు బకాయిలతో తీవ్ర సంక్షోభం
రాజన్నసిరిసిల్ల,వెలుగు: మహారాష్ట్ర దెబ్బకి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ విలవిల్లాడుతోంది. మహారాష్ట్రలోని మాలేగావ్ నుంచి తక్కువ రేట్లకే పాలిస్టర్ క్లాత్ సప్లై అవుతుండడంతో సిరిసిల్ల బట్టకు గిరాకీ లేకుండా పోయింది. దీంతో సిరిసిల్ల లో తయారైన దాదాపు 2 కోట్ల మీటర్ల బట్ట గుట్టలుగా పోగుపడింది. దీనికి తోడు
బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలు రిలీజ్ చేయకపోవడంతో సిరిసిల్ల వస్త్ర వ్యాపారులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నెల 15 నుంచి సిరిసిల్లలోని పరిశ్రమలు మూతపడ్డాయి.
బతుకమ్మ ఆర్డర్లతో పాలిస్టర్ బంద్
ఏడేండ్ల కిందటి దాకా సిరిసిల్లలో తయారైన పాలిస్టర్బట్టకు మంచి గిరాకీ ఉండేది. సిరిసిల్ల నేతన్నలకు మాజీ మంత్రి కేటీఆర్ బతుకమ్మ చీరల ఆర్డర్ ఇప్పించారు. ఏటా బతుకమ్మ పండుగకు ప్రభుత్వం కోటి చీరలు ఆర్డర్ ఇచ్చేది. దీంతో ఇక్కడ నేతన్నలు
పాలిస్టర్ బట్ట తయారీ దాదాపు ఆపేశారు. గతంలో సిరిసిల్లలో తయారైన పాలిస్టర్ క్లాత్ హైదరాబాద్ లోని వస్త్రవ్యాపారులు కొనేవారు. ఏడేండ్లుగా సిరిసిల్ల నుంచి క్లాత్ రాకపోవడంతో వారు మహారాష్ట్రలోని మాలేగావ్ నుంచి బట్టను కొని..ప్రాసెస్ చేసి అమ్ముతున్నారు.
మాలేగావ్ బట్ట ఛీప్
సిరిసిల్లలో తయారవుతున్న పాలిస్టర్ బట్టకు మార్కెట్లో ధర రావడంలేదు. పాలిస్టర్ దోతులు, పంచెలు, ఇతర మెటీరియల్‌ను హైదరాబాద్ వ్యాపారులు కొనేవారు. మాలేగావ్ నుంచి క్వాలిటీ ఉన్న బట్ట మీటర్ రూ .7కే వస్తుండగా.. సిరిసిల్ల బట్ట మీటరు రూ. 9 పడుతోంది. మీటర్‌కు రూ. 2 తేడా ఉండడంతో వ్యాపారులు ఇక్కడ కొనడానికి ఆసక్తి చూపడంలేదు. దీంతో సిరిసిల్లలో దాదాపు 2 కోట్ల మీటర్ల పాలిస్టర్ బట్ట అమ్ముడుపోకుండా పోగుపడింది. దీనికి తోడు ట్రాన్స్ పోర్ట్, యారన్ రేట్లు, కూలీ పెరగడంతో బట్ట తయారీ యజమానులకు గిట్టుబాటు కావడం లేదు.
జీఎస్టీ భారం
యార్న్‌పై కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి 12 శాతం జీఎస్టీ విధిస్తోంది. యార్న్ ధరలు పెరగడంతో ఇబ్బంది పడుతున్న టైమ్‌లో జీఎస్టీ విధించడంతో నేతన్నల మీద మోయలేని భారం పడుతోంది. మరోవైపు మహారాష్ట్ర సర్కార్ మాలేగావ్ వస్త్ర పరిశ్రమకు విద్యుత్ రాయితీ ఇస్తోంది. అక్కడ కూలీ రేట్లు కూడా తక్కువే. ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తుండడంవల్ల వ్యాపారులు ఎంత బట్ట ఆర్డర్ పెట్టినా టైమ్‌కు సప్లై చేయగలుగుతున్నారు. పాలిస్టర్లో కాటన్ మిక్స్ చేయడం, కొత్త డిజైన్లలో తయారు చేయడం వల్ల కూడా మాలేగావ్ బట్టకు క్రేజ్ పెరిగింది.
పేరుకుపోయిన బకాయిలు
నేతన్నలకు రావాల్సిన బతుకమ్మ చీరల బకాయిలను గత సర్కార్ రిలీజ్ చేయలేదు. 2023కి సంబంధించి రూ. 204 కోట్లు, 2022కి సంబంధించి రూ. 12 కోట్లు ప్రభుత్వం నేతన్నలకు బకాయి పడింది. రాజీవ్ విద్యామిషన్ కింద స్కూల్ యూనిఫామ్స్, క్రిస్మస్, రంజాన్ కానుకల కోసం సప్లై చేసిన బట్టల పైసలు కూడా ఇవ్వలేదు. సిరిసిల్ల వస్త్ర వ్యాపారులను ఆదుకునేందుకే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చామన్న మాజీ మంత్రి కేటీఆర్ బకాయిలను రిలీజ్ చేయకపోవడంతో వస్త్ర పరిశ్రమ ఇబ్బందులు పడుతోంది. చీరల ఉత్పత్తి కోసం అప్పులు తెచ్చిన వ్యాపారులు మిత్తీలు కట్టలేక నష్టపోతున్నారు. దీంతో ఏమీచేయలేక నిరవధిక బంద్ నిర్ణయం తీసుకున్నారు.
రోడ్డున పడ్డ 10వేల మంది కార్మికులు ..
సిరిసిల్లలో 30వేల మరమగ్గాలున్నాయి. వస్త్ర పరిశ్రమ బంద్‌తో 10 వేల మంది కార్మికులు, 2వేల మంది వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. మీటర్ బట్ట ఉత్పత్తి చేస్తే కార్మికుడికి రూ. 1.25 కూలీ ఇస్తారు. ఒక్కో కార్మికుడు ఒక్కో మగ్గంపై రోజుకు 50 మీటర్ల బట్ట ఉత్పత్తి చేస్తాడు. ఇక్కరు పది మగ్గాల దాకా నడుపుతారు. ఈ లెక్కన ఒక్కొక్కరికి రోజుకు రూ. 500 చొప్పున నెలకు రూ. 15వేల వరకు వచ్చేది. సాంచాలు బంద్ కావడంతో ఉపాధి దెబ్బతింటోంది.
నివేదిక కోరిన మంత్రి తుమ్మల
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై రాష్ట్ర చేనేత,జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టి సారించారు. తాజా పరిస్థితిపై చేనేత, జౌళిశాఖ ఆధికారుల నుంచి నివేదిక కోరారు. గతంలో సిరిసిల్ల నేతన్నలకు ఇచ్చిన ఆర్డర్లు, బకాయిలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపునకు సంబంధించి సర్కారు ఇచ్చే ఆదేశాల కోసం కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పాత సాంచాలతో సమస్య..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆధునికతకు దూరంగా ఉండడం కూడా సమస్యగా మారింది. కాలానికి తగినట్టు ఫ్యాషన్, డిజైన్లలో ఉత్పత్తి చేయలేకపోవడం డిమాండ్ తగ్గడానికి కారణం. మహారాష్ట్రతో పోలిస్తే సిరిసిల్ల బట్ట క్వాలిటీగా కూడా ఉండట్లేదు. థర్డ్ గ్రేడ్ యార్న్ కొనడం వల్ల క్వాలిటీ బట్ట ఉత్పత్తి కావడం లేదు. సాంచాలు పాతవి కావడంతో ప్రొడక్షన్లో వేగం కూడా పెరగడంలేదు. మరమగ్గాలలో మోడ్రన్ లూమ్స్ వాడడంలేదు. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో.. బీవండి, షోలాపూర్‌లలో ఎయిర్ జెట్, వాటర్ జెట్, ర్యాపియర్ లాంటి ఆధునిక మగ్గాలు వాడుతున్నారు.
ఎయిర్ జెట్ 2వేలు, వాటర్ జెట్ వెయ్యి, ర్యాపియర్ 400 మీటర్ల స్పీడ్ తో బట్టను ఉత్పత్తి చేస్తోంది. సిరిసిల్లలోని పాత సాంచాల ద్వారా 180 మీటర్ల స్పీడ్‌తో ఉత్పత్తి జరుగుతోంది. తంగళ్లపల్లి టెక్స్ టైల్ పార్క్‌లో ఆధునిక మగ్గాలున్నప్పటికీ ఇతర కారణాలతో ఉత్పత్తి నిలిచింది.