
- యూపీఐ నుంచి హోటల్స్ బుకింగ్స్ వరకు అన్ని ఒకే చోట
- ప్రతీ ట్రాన్సాక్షన్‌పై టాటా నూ కాయిన్స్ పొందే అవకాశం
- ఒక కాయిన్ ఒక రూపాయికి సమానం
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పోటీ..
హైదరాబాద్, వెలుగు: టాటా సూపర్ యాప్ ‘టాటా న్యూ’ గురువారం లాంచ్ అయ్యింది. ఇప్పటి వరకు టాటా గ్రూప్ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సూపర్ యాప్, గురువారం నుంచి కన్జూమర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. అండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉప్పు నుంచి కార్లు, ఏసీలు, లగ్జరీ హోటల్స్, ఎయిర్‌లైన్స్ వరకు వివిధ సెక్టార్లలో బిజినెస్ చేస్తున్న టాటా గ్రూప్, తన ప్రొడక్ట్‌లు, సర్వీస్‌లను టాటా నూ ద్వారా అందిస్తోంది. అంటే తాజ్ హోటల్స్‌లో రూమ్‌ను, ఎయిర్‌ఏషియా టికెట్స్‌ను ఈ సూపర్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కేవలం టాటా గ్రూప్ ప్రొడక్ట్‌లే కాకుండా వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు, వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, క్లాత్స్ వంటి ప్రొడక్ట్‌లు కూడా ఈ యాప్ ద్వారా కొనుక్కోవచ్చు. ఇప్పటి వరకు ఈ–కామర్స్ సెక్టార్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ల ఆధిపత్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. టాటా నూతో ఈ పోటీలోకి టాటా గ్రూప్ కూడా జాయిన్ అయ్యింది.
రివార్డ్‌లు, డిస్కౌంట్‌లు..
కస్టమర్లను ఆకర్షించేందుకు భారీగా రివార్డ్‌లను, డిస్కౌంట్లను టాటా న్యూ ఆఫర్ చేస్తోంది. ఈ యాప్ ద్వారా ఏదైనా సర్వీస్‌ను లేదా ప్రొడక్ట్‌ను కొనుగోలు చేస్తే ‘నూకాయిన్స్’ ను టాటా గ్రూప్ ఇస్తోంది. ఒక నూకాయిన్ విలువ ఒక రూపాయికి సమానం. ఈ నూకాయిన్ల వ్యాలిడిటీ ఏడాది వరకు ఉంటుంది. ఈ కాయిన్లను వాడుకొని ఇతర ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా చేసే ప్రతీ ట్రాన్సాక్షన్‌పై నూకాయిన్లను టాటా గ్రూప్ అందిస్తోంది. కానీ, అమెజాన్ పే లేదా పేటీఎం వాలెట్ల మాదిరే ఈ నూకాయిన్లను టాటా పే ద్వారా మాత్రమే వాడుకోవడానికి ఉంటుంది.
యూపీఐ పేమెంట్స్ కూడా..
టాటా నూ ద్వారా యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవడానికి వీలుంటుంది. కిరాణా షాపుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేసుకోవచ్చు. టాటా పే ద్వారా డబ్బులు పంపుకోవచ్చు. ఆటో పేను మేనేజ్ చేసుకోవచ్చు. డీటీహెచ్ బిల్లులు, మొబైల్ రీఛార్జ్‌లు వంటివి కూడా ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు. మరోవైపు టాటా ఐపీఎల్‌కు సంబంధించిన ఇన్‌ఫర్మేషన్ కూడా ఈ యాప్‌లో కనిపిస్తుంది. గ్రోసరీ, మెడిసిన్స్, క్లాత్స్, ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ కేటగిరీలలోని ప్రొడక్ట్‌లను ఈ యాప్ ద్వారా కొనొచ్చు.