వైసీపీ మేనిఫెస్టోపై ఉత్కంఠ... ఆ ఒక్క హామీ ఇస్తే, కూటమి గల్లంతే.. 

ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇప్పుడు అందరి చూపు మేనిఫెస్టోలపై పడింది. ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నప్పటికీ మేనిఫెస్టో ప్రకటించని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి తరఫున ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించకపోయినా సూపర్ సిక్స్ అంటూ 6 హామీలను జనాల్లోకి తీసుకెళ్తుంది టీడీపీ. అధికార వైసీపీ మాత్రం మేనిఫెస్టో ఇప్పుడు, అప్పుడు అంటూ ఊరిస్తోంది.

ఈ క్రమంలో ఏప్రిల్ 27న వైసీపీ మేనిఫెస్టో విడుదల ఉంటుందని సమాచారం అందుతోంది. 2019 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో 99శాతం హామీలను నెరవేర్చమని చెప్పుకుంటున్న వైసీపీ, ఈసారి కూడా అవే పథకాలను కంటిన్యూ చేస్తూ రైతులు, మహిళలతో పాటు బీసీ వర్గాలను ఆకర్షించేలా పలు కీలక హామీలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రుణమాఫీ అంశం ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి.

మేనిఫెస్టోలో రుణమాఫీ అంశాన్ని చేర్చాలని వైసీపీ నాయకులు జగన్ ను కోరుతుండగా ఆయన మాత్రం ఎటూ తేల్చటం లేదని, అందుకే మేనిఫెస్టో విడుదల ఆలస్యం మవుతోందని తెలుస్తోంది. అయితే, ఈసారి మేనిఫెస్టో కూడా తక్కువ అంశాలతో ఎక్కువ మందిని ప్రభావితం చేసేలా ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ వైసీపీ గనక రుణమాఫీ హామీని కూటమి కంటే ముందే ప్రకటిస్తే గనక ఈ ఎన్నికలపై కూటమి ఆశలు వదులుకోవాల్సిందే అన్న అభిప్రాయం వెల్లడవుతోంది.