- అల్లాదుర్గం, మెటల్ కుంట రోడ్డుకు తరచూ రిపేర్లు
- రోడ్డు రీ డిజైన్కోసం రూ.57 కోట్ల ప్రతిపాదనలు
- నిజాం కాలం నాటి రోడ్డును పునరుద్ధరించాలని కోరుతున్న ప్రజలు
సంగారెడ్డి/రాయికోడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సిరూర్గ్రామ శివారులో మంజీర నది బ్రిడ్జి సమీపంలో అల్లాదుర్గం- మెటల్ కుంట రోడ్డు నిర్మితమై ఉంది. కాగా నాలుగు కిలోమీటర్ల దూరంలో మంజీరా బ్యాక్ వాటర్ కారణంగా ఈ రోడ్డు ప్రమాదకరంగా మారింది. సిరూర్ గ్రామం నుంచి మొదలయ్యే ఈ రోడ్డు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్ తోపాటు మెదక్, నిజామాబాద్ జిల్లాలకు, పక్కనే ఉన్న కర్నాటకలోని బీదర్ జిల్లాకు అనుసంధానంగా ఉంటుంది. అలాగే 65, 161వ నేషనల్ హైవేలకు కూడా ఈ దారి లింకుగా ఉంది.
ఆ నాలుగు కిలోమీటర్ల పొడవులో రెండు కిలోమీటర్ల వరకు బ్లాక్ సాయిల్ కావడం వల్ల గట్టిదనం లేక రోడ్డు మార్గం తరచూ రిపేర్లకు వస్తోంది. దీనిపై వాహనాల రాకపోకలు ఎక్కువగానే ఉంటాయి. రోడ్డు బాగా లేకపోయినా తప్పని పరిస్థితుల్లో వాహనదారులు ఈ దారి గుండా ప్రయాణిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. వర్షాలు ఎక్కువై రోడ్డు తెగిపోతే రాకపోకలు నిలిచిపోనున్నాయి.
రోడ్డుకు రీ డిజైన్ చేయాల్సిందే
అల్లాదుర్గం-మెటల్ కుంట రోడ్డుకు రీ డిజైన్ చేయాల్సిందేనని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులు ప్రతిపాదించారు. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు రిపేర్ల కోసం రూ.8 కోట్లు మంజూరు చేసి రిపేర్ పనులు చేయిస్తుండగా కింది భాగంలో పగుళ్లు ఏర్పడి పనులు నిలిచిపోయాయి. మంజీరా బ్రిడ్జి నుంచి మహబత్పూర్ గ్రామ శివారు వరకు నాలుగు కిలోమీటర్ల మేర పనులు చేపట్టారు.
రోడ్డును చదును చేసి ఫార్మేషన్ రీ మెటల్ పనులు చేపట్టారు. పగుళ్లు గ్రహించిన అధికారులు మట్టిని తవ్వి పరిశీలించగా నది ప్రవాహంతో పాటు రిపీట్మెంట్ లేక రోడ్డు కొట్టుకుపోతుందని భావించి అందుకు అనుగుణంగా పనులు చేయాలని చూసినా చేయలేకపోయారు. శాశ్వత పనుల నిర్మాణం కోసం రీ డిజైన్ తో పాటు పనులు పూర్తి చేసేందుకు మరో రూ.57 కోట్లతో ప్రతిపాదనలు రెడీ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మంజీరా నదిలోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది.
ఆ రోడ్డును పునరుద్ధరించాలి
ప్రస్తుతం వినియోగిస్తున్న అల్లదుర్గం-మెటల్ కుంట రోడ్డు కాకుండా నిజాం కాలంలో వేసిన రోడ్డును పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే రోడ్డుకు కొంత దూరంలో పక్కనుంచి మంజీర నదిపై రాయిపల్లి, దౌల్తాబాద్ గ్రామాల శివార్ల మధ్య నిజాం కాలంలో బ్రిడ్జి నిర్మించారు. రాయిపల్లి నుంచి దౌల్తాబాద్ మీదగా సిరూర్ చౌరస్తా వరకు 5 కిలో మీటర్ల దూరంలో రోడ్డు వేశారు. బ్రిడ్జితో పాటు ఆ రోడ్డు ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది. కానీ కొంత భాగం మంజీరా బ్యాక్ వాటర్ తో అది మూసుకోవడంతో కొత్తదారిని నిర్మించారు. ఈ ప్రాంతంలో బ్లాక్ సాయిల్ ఉండడంతో రోడ్డు కాస్త మెల్లిగా కుంగిపోతుంది. అందుకే ప్రస్తుతం ఉన్న రోడ్డును కాకుండా పాత రోడ్డును పునర్నిర్మిస్తే శాశ్వత పరిష్కారం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.