IPL 2024: నరైన్‌తో కలిస్తే అంతే: కేకేఆర్ జట్టులో చేరిన 16 ఏళ్ళ మిస్టరీ స్పిన్నర్

IPL 2024: నరైన్‌తో కలిస్తే అంతే: కేకేఆర్ జట్టులో చేరిన 16 ఏళ్ళ మిస్టరీ స్పిన్నర్

ఆఫ్ఘనిస్తాన్ జట్టులో స్పిన్నర్లకు కొదువ లేదు. ఆ దేశంలో స్పిన్నర్లు పుట్టుకొస్తూనే ఉంటారు. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్,మహమ్మద్ నబీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో తామెంటో నిరూపించుకున్నారు. వీరితో పాటు యంగ్ ప్లేయర్స్ క్వయిస్ అహ్మద్, నూర్ అహ్మద్ దూసుకొస్తున్నారు. తాజాగా 16 ఏళ్ళ  ఆఫ్ఘన్ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ తన ఉనికిని చాటుకునేందుకు సిద్ధమయ్యాడు. నిన్న( ఏప్రిల్ 9) ఐపీఎల్ ఆడడానికి భారత్ లో అడుగుపెట్టి కేకేఆర్ క్యాంప్ లో చేరాడు. 

కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ గాయపడ్డాడు. దీంతో ఈ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ స్థానంలో అదే దేశానికి చెందిన ఆఫ్‌స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్‌ను ఎంపిక చేసింది. ఘజన్‌ఫర్‌ వయసు కేవలం 16 సంవత్సరాలే కావడం విశేషం. అతను 20 లక్షల బేస్ ప్రైజ్ కు కోల్ కతా జట్టులో చేరతాడు. అల్లా ఘజన్‌ఫర్ 16 సంవత్సరాలే అయినప్పటికీ చాలా ప్రతిభ గల బౌలర్. 16 ఏళ్లకే తన స్పిన్ మాయాజాలంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టులో చేరి సంచలనంగా మారాడు. 

అల్లా ఘజన్‌ఫర్ ఆఫ్ఘనిస్తాన్‌ తరపున 2 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ లాడాడు. వన్డేల్లో 5 వికెట్లు, టీ20ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ యువ స్పిన్నర్ నరైన్ కు జత కలిస్తే ప్రత్యర్థులకు చుక్కలు కనబడతాయని కేకేఆర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన కేకేఆర్ కు చెన్నై షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ లు గెలిచింది. లక్నో సూపర్ జయింట్స్ తో ఆదివారం (ఏప్రిల్ 14) కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.