ఆమె కోరి కష్టాన్ని తెచ్చుకున్నది.. రేప్ బాధితురాలిపై అలహాబాద్ హైకోర్టు జడ్జి కామెంట్

ఆమె కోరి కష్టాన్ని తెచ్చుకున్నది..  రేప్ బాధితురాలిపై అలహాబాద్ హైకోర్టు జడ్జి కామెంట్
  • కేసులో నిందితుడికి బెయిల్ ఇవ్వడంపై దుమారం 

అలహాబాద్:  అత్యాచార యత్నంపై ఇటీవల సంచలన  తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు తాజాగా మరో వివాదాస్పద ఉత్తర్వు  జారీ చేసింది. అత్యాచారం జరిగేందుకు బాధితురాలే కారణమని, ఆమె స్వయంగా కష్టాన్ని తెచ్చుకుందంటూ  జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ నిందితుడికి బెయిలు మంజూరు చేశారు. ఇది రేప్ కేసు కాదని, పరస్పర అంగీకార సంబంధం కావచ్చని ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలోని ఓ వర్సిటీలో ఎంఏ చదువుతున్న బాధితురాలు 2024 సెప్టెంబర్ 21న తన ముగ్గురు మహిళా స్నేహితులతో బార్​కు వెళ్లింది. 

అక్కడ తెల్లవారుజామున 3 గంటల వరకు వారు మద్యం సేవించారు. మిగతా ముగ్గురు స్నేహితులు వెళ్లిపోయారు. ఈమె వెళ్లలేనంతగా మత్తులో ఉండడంతో వదిలేసి పోయారు. ఆ సమయంలో ఆమెకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. తన ఫ్లాటుకు రమ్మన్నాడు. ఆమె కూడా వెళ్లింది. తర్వాత ఫ్లాటుకు వెళ్లిన తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె కేసు పెట్టింది. 

కారులో వెళ్లే సమయంలోనే తనను అసభ్యంగా తాకాడని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో గురువారం ఈ  కేసు విచారణ సందర్భంగా జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులోని అంశాలను పరిశీలిస్తే.. బాధితురాలు స్వయంగా కోరి కష్టాన్ని తెచ్చుకున్నట్టుగా అనిపిస్తోందన్నారు.