న్యూఢిల్లీ: నటి,బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద అలహాబాద్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను రద్దు చేయాలని వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినందుకు సీనియర్ నటి జయపద్రపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ జయప్రద హైకోర్టు పిటిషన్ వేశారు. గురువారం (ఫిబ్రవరి29) ఈ పిటిషన్ నిరాధారం అని హైకోర్టు కొట్టివేసింది.
అసలేం జరిగిందంటే..
2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఆమె బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించినందుకు నటి జయప్రద పై రెండు కేసులు నమోదు అయ్యాయి. రాంపూర్ లో జరిగిన ఓ సభలో ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని జయప్రదకు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా కోర్టు సమన్లు జారీ చేసినప్పటికీ జయప్రద కోర్టుకు హాజరు కాలేదు. దీంతో రాంపూర్ జిల్లా కోర్టు జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.
తనపై ఉన్న రెండు కేసులు విచారణకు హాజరు కాకపోవడంతో గురువారం (ఫిబ్రవరి 29) రాంపూర్ ప్రత్యేక కోర్టు ఆమెను పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. దీంతో సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద అరెస్ట్ తప్పదని.. రేపో మాపో పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి.