లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో బుల్డోజర్ కూల్చివేతలపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. బాధితులకు ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన నోటీసులపై స్టే విధిస్తూ ఆదివారం (అక్టోబర్ 20) ఉత్తర్వులు జారీ చేసింది. పీడబ్ల్యూడీ నోటీసులపై స్పందించేందుకు బాధిత వ్యక్తులకు కోర్టు 15 రోజుల సమయం ఇచ్చింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 23కి వాయిదా వేసింది.
బహ్రైచ్ హింసాకాండ:
2024, అక్టోబర్ 13న మహారాజ్‌గంజ్‌లోని ప్రార్థనా స్థలం లోపల భారీగా శబ్ధాలు పెట్టడంతో రెండు వర్గాల మధ్య వివాదం చేలరేగింది. ఈ ఘటనలో రామ్ గోపాల్ మిశ్రా అనే వ్యక్తిపై మరో వర్గం వ్యక్తులు కాల్పులు జరపగా.. అతడు మృతి చెందాడు. దీంతో బహ్రైచ్‌లో పెద్ద ఎత్తున మత ఘర్షలు చెలరేగగా.. ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. ఈ అల్లర్లపై 1000 మందికి పైగా పోలీసులు కేసు నమోదు చేశారు. బహ్రైచ్ హింసాకాండలో అబ్దుల్ హమీద్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
ALSO READ | జమ్మూకాశ్మీర్‌లో టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు లేబర్ మృతి
ఈ క్రమంలో బహ్రైచ్ హింసాకాండ ప్రధాన నిందితుడు అబ్దుల్ హమీద్‌తో సహా 23 మంది వ్యక్తుల ఇళ్లు, దుకాణాలకు శనివారం (అక్టోబర్ 19) పీడబ్ల్యూడీ నోటీసులు ఇచ్చింది. అక్రమ స్థలాల్లో నిర్మించిన తమ కట్టడాలను మూడు రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాధితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తమ నివాసాలపై చేపట్టనున్న బుల్డోజర్ యాక్షన్‌ను నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు.. పీడబ్ల్యూడీ నోటీసులపై స్టే విధించింది. బాధితుల నిర్మాణాలపై బుల్డోజర్ చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. పీడబ్ల్యూడీ నోటీసులపై స్పందించేందుకు బాధిత వ్యక్తులకు కోర్టు 15 రోజుల సమయం ఇచ్చింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 23కి వాయిదా వేసింది.