ఖమ్మం టౌన్, వెలుగు : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని టీయూ డబ్ల్యూయుజే(టీజేఎఫ్) వ్యవస్థాపకుడు, రాష్ట్ర ప్రెస్ అకాడెమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. మంగళవారం ఖమ్మంలోని డీపీఆర్సీ బిల్డింగ్ లో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ అధ్యక్షతన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల జర్నలిస్టుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అల్లం నారాయణతోపాటు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్హజారే, టెంజూ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కళ్యాణ్ చక్రవర్తి, రాష్ట్ర కోశాధికారి యోగానంద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ దశాబ్దాల జర్నలిస్టుల ప్రధాన సమస్య ఇండ్ల స్థలాలు కేటాయింపు, కార్పొరేట్ హాస్పిటళ్లలో హెల్త్ కార్డుల చెల్లుబాటు, జర్నలిస్టుల మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా, పింఛన్ వర్తింపుపై ట్రేడ్ యూనియన్ గా మిలిటెంట్ ఉద్యమాలు చేయడానికి జర్నలిస్టులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ పాలకుల పనితీరు వల్ల కూడా జర్నలిస్టుల ఇండ్లస్థలాల ప్రక్రియలో అలసత్వం జరిగినది వాస్తవమేనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల తగ్గింపు యోచన చేస్తోందని, ఆ ఆలోచనను వెంటనే విరమించుకోవాలన్నారు.
ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కేటాయింపునకు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రారవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్లోజు శ్రీనివాసరావు, షఫీ, ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లం శ్రీను, జిల్లా కమిటీ భాద్యులు పాల్గొన్నారు.