ఫిబ్రవరి 9 నుంచి అల్లమ ప్రభు జాతర

ఫిబ్రవరి 9 నుంచి అల్లమ ప్రభు జాతర
  • 3 రోజుల పాటు ఉత్సవాలు
  • వివిధ ప్రాంతాల నుంచి తరలిరానున్న భక్తులు

నస్రుల్లాబాద్, వెలుగు: నస్రుల్లాబాద్​ మండలం బొమ్మన్​దేవ్​పల్లిలో కొండపై వెలసిన అల్లమ ప్రభువు జాతర ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది.మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 9న అగ్ని గుండం, 10న నిండు జాతర, రథోత్సవం, 11న కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. అల్లముడిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర, కర్నాటకలతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు.

దీంతో ఈ మూడు రోజుల పాటు బొమ్మన్​దేవ్​పల్లి భక్త జనంతో కిటకిటలాడనుంది. కర్నాటకలోని శివమొగ్గ జిల్లా శికారిపురి తాలూకాలోని బల్లిగావి అల్లమ ప్రభు జన్మస్థలం. అల్లముడు తన గురువు అనిమిషుడి ద్వారా పొందిన ఆత్మలింగాన్ని తీసుకొని దేశ సంచారం చేస్తూ మాఘ మాసంలోని అమావాస్య రోజున బొమ్మన్​దేవ్ ​పల్లి గ్రామ కొండపై ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. అందుకే ఈ కొండకు అల్లమ ప్రభు కొండగా పేరొచ్చింది.

ఎప్పటికీ ఎండని కుంట..

అల్లమ ప్రభు మహిమతో కొండపైకి వెళ్లే దారిలో కుంటలో అన్ని కాలాల్లోనూ నీరు ఉంటుంది. ఈ నీటిని తీసుకొని కొండపై ఉన్న ఆత్మాలింగాన్ని పూజిస్తే కోరిన కొర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. అల్లముడి శిష్యులైన బసవన్న, సిద్ధప్ప ఈ విషయాన్ని ప్రచారం చేశారు.

ఎస్సీలే పూజారులు

పూర్వం ఎస్సీలను ఆలయాల్లోకి అనుమతించేవారు కాదు. కానీ ఈ ఆలయంలో మాత్రం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే పూజారులుగా కొనసాగుతుండడం విశేషం. ప్రస్తుతం అనిత, రాణి అనే మహిళలు పూజారులుగా 
ఉన్నారు.