గ్రామ పంచాయతీ పనులు చేయవలసిన ఓ మహిళా కాంట్రాక్టర్ వర్కర్ తో ఆ పంచాయతీ సెక్రెటరీ తన ఇంట్లో వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడు. అసభ్యకరమైన మాటలను మాట్లాడుతూ.. ఇంట్లో పని చేయకపోతే ద్యోగం నుండి తొలగిస్తానని బెదిరిస్తున్నట్లు బాధితులు వాపోయింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..
ఆళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కిసరి కుమారి ఆళ్లపల్లి పంచాయతీలో 2019 నుండి కాంట్రాక్ట్ పారిశుద్ధ్య వర్కర్ గా పనిచేస్తుంది. పంచాయితీలో వీధులలో పరిశుభ్రత పనులను చేస్తుంటుంది. ఈ పనులే కాకుండా సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ ఇంట్లో కూడా పనిచేస్తుంది. సెక్రటరీ ఇంట్లో ఎలాంటి జీతభత్యాలు లేకుండా వెట్టి చాకిరి చేస్తుంది. ఇంట్లో అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, చెప్పులతో సహా ఇంటిని శుభ్రపరచడం లాంటి వెట్టి పనులు చేపిస్తున్నాడు.
అంతేగాక పంచాయతీ కార్యాలయం పక్కనే సెక్రటరీ పంచాయితీ నర్సరీ స్థలంలో కొంత ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కోళ్ల ఫారంని ఏర్పాటు చేశాడు. ఆ కోళ్ల ఫారంలో కూడా పనిచేస్తున్నట్టు బాధితురాలు తెలిపింది. తన ఇంట్లో పని చేయకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నాడని కుమారి ఆవేదన వ్యక్తం చేసింది.
కూలి నాలి చేసి జీవనం గడుపుతున్న కుమారికి తల్లిదండ్రులు, భర్త లేరు.. ఒంటరి మహిళ.. అమాయకురాలు. ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇంట్లో పని చేయించుకుంటూ వెట్టి చాకిరి చేయించుకోవడమే కాకుండా ఆమెను సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ మానసిక శోభకు గురి చేస్తున్నాడు. ఈ విషయంపై ఎంపీడీఓ శ్రీనివాసరావుకు కుమారి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసినట్టు తెలుసుకున్న సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ ఎంపీడీవో కార్యాలయంలో పాశుద్ధ్య కార్మికుల సమక్షంలో అసభ్య పదజాలంతో దూషిస్తూ తనపై కాలుకున్న చెప్పు తీసి కొట్టేందుకు వచ్చాడని.. చేయి చేసుకోవడానికి ప్రయత్నించాడని ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చింది.
సెక్రటరీ ప్రవీణ్ చేసే ఇబ్బందులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు కుమారి తెలిపింది. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులను ఇబ్బంది పెడుతున్న ప్రవీణ్ కుమార్ ను సస్పెండ్ చేయాలని ఆమె డిమాండ్ చేసింది.