ఓ వైపు కామెడీ సినిమాలు చేస్తూనే, మరోవైపు యాక్షన్, ఎమోషన్‌తోనూ మెప్పిస్తున్నాడు అల్లరి నరేష్. తను హీరోగా సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన చిత్రం ‘బచ్చల మల్లి’. డిసెంబర్ 20న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ ఇలా ముచ్చటించాడు.
రియల్ లైఫ్ స్టోరీ
‘నాంది’ తరహాలో మంచి కంటెంట్ ఉన్న సినిమా చేద్దామనుకుంటున్న సమయంలో ఈ కథ నా దగ్గరకు వచ్చింది. సుబ్బు చెప్పగానే సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశా. నిర్మాత రాజేష్ గారు ఎమోషనల్‌గా ఈ స్టోరీకి కనెక్ట్ అయ్యారు. ఊర్లో గొడవలను తన గొడవలుగా ఫీల్ అయ్యే బచ్చల మల్లి అనే వ్యక్తి జీవితం స్ఫూర్తితో సుబ్బు ఈ కథ రాశాడు. అందుకే ఈ టైటిల్.
మూర్ఖత్వపు నిర్ణయాలు
నన్ను వద్దనుకుంటే నాకు ఎవరూ వద్దు అనుకునే పాత్ర. ఒకరితో డిస్కనెక్ట్ అయితే ఇక ఆ చాప్టర్‌ని క్లోజ్ చేసే క్యారెక్టర్. చాలా ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్ ఇది. ప్రతి మనిషిలోనూ అలాంటి లక్షణాలు ఉంటాయి. ఒక్కోసారి మనకు తెలియకుండానే జీవితంలో కొన్ని నిర్ణయాలు మూర్ఖత్వంతో తీసుకుంటాం. అలా అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్ ఇది.
ఏడవడంలో కొత్తదనం
ఈ కథని చాలా నిజాయితీగా చెప్పాం. సినిమా ప్రారంభమైన 5 నిమిషాలకే నరేష్‌ని మర్చిపోయి బచ్చల మల్లినే చూస్తారు. నా గత సినిమాల బాడీ లాంగ్వేజ్ కనిపించకూడదని, ప్రతిదీ కొత్తగా చేయాలని సుబ్బు చాలా కేర్ తీసుకున్నారు. తన నడకలో కూడా మూర్ఖత్వం చూపించాలని, కాస్త కొత్తగా ఏడవమని చెప్పేవారు (నవ్వుతూ). అలాగే ప్రతి సీన్‌ను నేచురల్‌గా చూపించారు. యాక్షన్ సీన్‌లో కూడా రియల్‌గా కొట్టుకున్నట్టుగానే ఉంటుంది.
ప్రీ క్లైమాక్స్ హైలైట్
1995, 2005 అనే రెండు టైమ్ లైన్స్‌లో జరిగే కథ ఇది. అందుకు తగ్గట్టే స్క్రీన్ ప్లే బ్యాక్ అండ్ ఫోర్త్‌గా ఉంటుంది. సింపుల్ స్టోరీని సిన్సియర్‌గా చెప్పాం. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌తో ఇంప్రెస్ చేస్తుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఆఫ్ ది సినిమా అదే.
ప్రేమ వల్ల మారాడా?
కావేరి అనే అమ్మాయి రాకతో అతను మారతాడు. అతను మారాక తను చేసిన పాత తప్పులతో సమస్యలు ఎదురవుతాయి. ఫైనల్‌గా తను ఏ వైపు టర్న్ అయ్యాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. కావేరిగా అమృత అయ్యర్ చాలా బాగా నటించింది. తనకు మంచి పేరొస్తుంది. అలాగే రావు రమేష్, అచ్యుత్ కుమార్, వైవాహర్ష, హరితేజ, రోహిణి గారు కీలకపాత్రలు పోషించారు.
కాంప్రమైజ్ కాకుండా..
ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే టెక్నీషియన్స్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని నిర్ణయించుకున్నాం. విశాల్ చంద్రశేఖర్ గారు తన మ్యూజిక్‌తోఎమోషన్‌ని తెరపైకి అద్భుతంగా ట్రాన్స్‌లేట్ చేశారు. అలాగే నాలుగు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. డీవోపీ రిచార్డ్ ఎం నాథన్ విజువల్స్ రిఫ్రెషింగ్‌గా ఉంటాయి. రాజేష్ గారు సినిమాపై పాషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఆయన గత చిత్రాల్లాగే ఇది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.
వినోదం, వైవిధ్యం మధ్య..
ఇండస్ట్రీలో నా లాంగ్ కెరీర్‌కు కారణం కామెడీనే. అదే నా బలం. అదే నా హోమ్ గ్రౌండ్. దాన్ని వదలను. మధ్యమధ్యలో బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి సీరియస్ కంటెంట్, ఎమోషన్ ఉన్న సినిమలు చేస్తాను. జానర్ ఏదైనా డిఫరెంట్ సినిమాలని చేయాలనేదే నా ప్రయత్నం. ‘సుడిగాడు 2’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈసారి పాన్ ఇండియా కంటెంట్‌తో ఉంటుంది కనుక ఇంకాస్త టైమ్ పడుతుంది.
హాస్యం తప్ప మిగతావన్నీ..
ఇప్పటివరకు నేను నటించిన చిత్రాల్లో చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ఇది. నవరసాల్లో హాస్యం తప్ప మిగతావన్నీ ఇందులో ఉన్నాయి. ‘గమ్యం’లో గాలి శీను పాత్ర ఎలా గుర్తుండిపోయిందో ‘బచ్చల మల్లి’ కూడా అలా ఓ పదేళ్ళ పాటు గుర్తుండిపోతాడు. ఆ పాత్ర ప్రభావం అలా ఉంటుంది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ప్రయత్నించాను.