హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుత పాలన అందిస్తున్నరని, ఆయన విజయాలను ఓర్వలేక అక్కసుతోనే బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నదని ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ పేర్కొన్నారు. బుధవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తోందని అన్నారు. వెనుకబడిన కొడంగల్ వంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఫార్మా విలేజ్ కోసం రైతులను ఒప్పించి భూసేకరణ జరుపుతున్నామని, రైతుల వేషాల్లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కలెక్టర్ పై దాడి చేశారని తెలిపారు.
దాడులు చేయడమే బీఆర్ఎస్ పార్టీ సంస్కృతి అని, సీఎం రేవంత్ రెడ్డి అల్లుడిపై కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొడంగల్ లో ఏర్పాటు చేస్తున్న ఫార్మా విలేజ్ వల్ల 30 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, 600ఎకరాల్లో ఫార్మా క్లస్టర్ రాబోతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ విలువ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు జైలులో చిప్పకూడు తినక తప్పదని హెచ్చరించారు. పదేండ్లు రేవంత్ రెడ్డినే సీఎంగా ఉంటారని, కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి వస్తే సహించేది లేదన్నారు.