అధికారుల బ్లేమ్ గేమ్!

అధికారుల బ్లేమ్ గేమ్!
  •     మేడిగడ్డ డ్యామేజీపై ఘోష్ కమిషన్​కు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు
  •     ఇతర డిపార్ట్​మెంట్ల లోపాలపై ఆధారాలతో అఫిడవిట్లు
  •     తామెక్కడ ఇరుక్కుంటామోనన్న ఆందోళనలో ఆఫీసర్లు
  •     అప్పటి సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆవేదన

హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ డ్యామేజీపై ఇరిగేషన్ అధికారులు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్​కు ఇరిగేషన్​లోని ఒక విభాగానికి చెందిన అధికారులు మరో విభాగం అధికారులపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్టు తెలిసింది. కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరుపుతున్న జ్యుడీషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్.. ఇరిగేషన్ శాఖలోని అన్ని విభాగాల అధికారులను విచారించిన సంగతి తెలిసిందే. ఈ నెల 27 నాటికి అఫిడవిట్ల రూపంలో వారి సమాధానాన్ని తెలియజేయాల్సిందిగా ఆదేశించారు.

ఓ అండ్ ఎం, క్వాలిటీ కంట్రోల్, ఎస్డీఎస్​వో, సీడీవో, ఎగ్జిక్యూషన్ సహా బ్యారేజీలకు సంబంధించిన ప్రతి ఒక్కరిని జస్టిస్ ఘోష్ విచారించారు. దీంతో శాఖలోని అన్ని విభాగాల అధికారుల నుంచి ఇప్పటికే అఫిడవిట్లను కాళేశ్వరం కమిషన్​కు అందజేసినట్టు తెలిసింది. అయితే, ఆ అఫిడవిట్లలో వారి డిపార్ట్​మెంట్ తీసుకున్న చర్యలతో పాటు.. ఇతర విభాగాల పనితీరుపైనా తీవ్రమైన ఆరోపణలు చేసినట్టు తెలిసింది.

ఒక డిపార్ట్​మెంట్​పై మరో డిపార్ట్​మెంట్​కు చెందిన అధికారులు.. ఆయా డిపార్ట్​మెంట్ల లోపాలను ఎత్తి చూపినట్టు తెలిసింది. అందుకు బ్యారేజీ మొదలైనప్పటి నుంచి కుంగిపోయేదాకా వివిధ విభాగాలు చేసిన పనులు, వారి వైఫల్యాలను కొందరు అధికారులు ఆధారాలతో సహా అఫిడవిట్లను దాఖలు చేసినట్టు తెలిసింది. 

కేసీఆర్ మాట మార్చడంతో ఇంజినీర్లలో టెన్షన్

మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పటి నుంచి ఇరిగేషన్ శాఖలోని ఇంజినీర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు కొందరు అధికారులు చెబుతున్నారు. అన్ని వేళ్లూ ఇరిగేషన్ ఆఫీసర్ల వైపే చూపుతుండడం.. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని చెప్పుకున్న మాజీ సీఎం కేసీఆర్.. ఇప్పుడు మాట మార్చి తానేమన్నా ఇంఇనీర్​నా అని అనడం వంటి కారణాలతో అధికారులు లోలోపల మదనపడుతున్నట్టు తెలుస్తున్నది. ఏ చిన్న పని చేయాలన్నా సంతకం పెడితే ఏం జరుగుతుందోనన్న భయంతో ఆఫీసర్లు పనులు చేస్తున్నట్టు డిపార్ట్​మెంట్​లోని కొందరు ఉన్నతాధికారులు వాపోతున్నారు.

ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​ను కేసీఆర్ తన హయాంలో హైజాక్ చేసేశారని అన్ని విషయాలనూ ఆయనే నిర్ణయించేవారని కొందరు చెబుతున్నారు. కనీసం తమ అభిప్రాయాలను చెప్పేందుకు కూడా అవకాశం ఉండేది కాదని అంటున్నారు. ఆయన చెప్పినట్టు చేశాక ఇప్పుడు తాము బ్లేమ్ అవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొందరు అధికారులు మేడిగడ్డ బ్యారేజీల విషయంలో తాము ఎక్కడ ఇరుక్కుంటామోనని ఆందోళన చెందుతున్నారన్న టాక్ అధికార వర్గాల్లో వినిపిస్తున్నది.

అందుకే తమను తాము రక్షించుకోవడానికి ఇతర విభాగాల్లో జరిగిన తప్పొప్పులపై దృష్టి పెట్టి ఆ లోపాలను వెలికి తీస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, ఆ అఫిడవిట్లలో ఏముందో చెప్పేందుకు మాత్రం అధికారులు ఇష్టపడడం లేదు. జస్టిస్ ఘోష్​ జులై తొలి వారంలో రాష్ట్రానికి రానున్నారు. ఆయన వచ్చాక విచారణ అంతా ఆ అఫిడవిట్ల ఆధారంగానే సాగుతుందని ఇప్పటికే తేల్చి చెప్పారు.