మాకేం లేదా ?..జనగామ ఎంసీహెచ్‌‌‌‌లో సిబ్బంది వసూళ్లు

  •    పేషెంట్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న స్టాఫ్‌‌‌‌
  •     వైద్య సేవలు అందించడంలో డాక్టర్ల నిర్లక్ష్యం
  •     పట్టించుకోని ఉన్నతాధికారులు

జనగామ, వెలుగు : తల్లీబిడ్డలకు మెరుగైన ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందించే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన జనగామ మాతాశిశు హాస్పిటల్‌‌‌‌లో డాక్టర్లు, స్టాఫ్‌‌‌‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టాఫ్‌‌‌‌ వసూళ్ల దందాకు తెరలేపగా, డాక్టర్లు డ్యూటీలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో హాస్పిటల్‌‌‌‌ నిర్వహణ అధ్వానంగా మారింది. డెలివరీ కోసం హాస్పిటల్‌‌‌‌లో జాయిన్‌‌‌‌ అయినప్పటి నుంచి డిశ్చార్జ్‌‌‌‌ అయ్యే వరకు ముడుపుల రూపంలో రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పేషెంట్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న స్టాఫ్‌‌‌‌ బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసలకోర్చి హాస్పిటల్‌‌‌‌కు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

గార్డుల నుంచి థియేటర్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ వరకు..

జనగామ శివారులోని చంపక్‌‌‌‌హిల్స్‌‌‌‌ వద్ద ఉన్న ఎంసీహెచ్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు జనగామ జిల్లాతో పాటు సిద్దిపేట, యాదాద్రి జిల్లాల నుంచి ఎంతో మంది వస్తుంటారు. గతంలో వైద్య విధాన పరిషత్‌‌‌‌ కింద పనిచేసిన ఈ హాస్పిటల్‌‌‌‌ ప్రస్తుతం డీఎంఈ పరిధిలోకి వెళ్లింది. జనగామకు మెడికల్‌‌‌‌ కాలేజీ రావడంతో దానికి అనుబంధంగా జిల్లా కేంద్రంలోని జిల్లా హాస్పిటల్‌‌‌‌తో పాటు, ఎంసీహెచ్‌‌‌‌ సైతం డీఎంఈ కంట్రోల్‌లో ఉంది. దీంతో మరింత మెరుగైన సేవలు అందుతాయని అంతా భావించారు. 

నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ హాస్పిటల్‌‌‌‌ నిర్వహణపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో స్టాఫ్‌‌‌‌ వసూళ్లకు తెర లేపారు. డెలివరీ కోసం హాస్పిటల్‌‌‌‌లో చేరినప్పటి నుంచి డిశ్చార్చ్‌‌‌‌ అయ్యే వరకు పలువురి చేతులు తడపక తప్పడం లేదు. సెక్యూరిటీ గార్డుల నుంచి మొదలు.. థియేటర్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ వరకు ‘ఏం లేదా ? ఎంతో కొంత ఇవ్వాలి కదా.. ప్రైవేట్‌‌‌‌కు వెళ్తే ఎక్కువ ఖర్చయ్యేవి.. ఇక్కడ ఆ మాత్రం ఇచ్చుకోలేరా’ అంటూ దబాయించి మరీ పేషెంట్‌‌‌‌ బంధువుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. తప్పనిపరిస్థితుల్లో పేషెంట్ల బంధువులు వారు అడిగినంత ముట్టజెపుతున్నారు.

డ్యూటీలో డాక్టర్ల నిర్లక్ష్యం

ఎంసీహెచ్‌‌‌‌లో పనిచేస్తున్న కొందరు డాక్టర్లు నిర్లక్ష్యంగా డ్యూటీ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనగామలోని అంబేద్కర్‌‌‌‌ నగర్‌‌‌‌కు చెందిన,  వైద్యఆరోగ్య శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి  డెలివరీ కోసం గత నెల 16న ఎంసీహెచ్‌‌‌‌లో అడ్మిట్‌‌‌‌ అయింది. సర్జరీ చేసిన డాక్టర్లు మహిళ మూత్ర నాళాన్ని కట్‌‌‌‌ చేశారు. విషయం తెలుసుకున్న బందువులు డాక్టర్లను ప్రశ్నించడంతో ‘ఏదోలా నయం చేస్తాం’ అంటూ కన్విన్స్‌‌‌‌ చేశారు. 

కానీ మహిళ పరిస్థితి విషమించడంతో ఇద్దరు ప్రైవేట్‌‌‌‌ డాక్టర్లను పిలిపించారు. కానీ అప్పటికే మహిళకు బ్లీడింగ్‌‌‌‌ కావడంతో పరిస్థితి మరింత విషమించింది. సుమారు రెండు గంటల పాటు శ్రమించి పేషెంట్‌‌‌‌ ఆరోగ్య పరిస్థితిని కంట్రోల్‌‌‌‌లోకి తెచ్చారు. విషయం బయటకు పొక్కకుండా డాక్టర్లు పేషెంట్‌‌‌‌ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. సుమారు పది రోజుల పాటు హాస్పిటల్‌‌‌‌లోనే ఉంచి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేసి ఇటీవలే డిశ్చార్జ్‌‌‌‌ చేశారు. 

ప్రస్తుతం ఆ మహిళ వారానికి ఒకసారి హాస్పిటల్‌‌‌‌కు వెళ్లి యూరిన్‌‌‌‌ పైప్‌‌‌‌ మార్చుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళ ఆరోగ్యం కుదుటపడడం కష్టమేనని సహచర ఉద్యోగులు అంటున్నారు. హెల్త్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పనిచేసే ఉద్యోగికే ఇలాంటి ఇబ్బంది ఎదురైతే మిగతా వారి పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు హాస్పిటల్‌‌‌‌లో కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉంది. హాస్పిటల్‌‌‌‌ ఆవరణలో కుక్కలు వెంటపడుతుంటే.. లోపల బెడ్ల పైన, మెట్లపైన కోతులు హంగామా చేస్తున్నాయి. దీంతో పేషెంట్లు భయాందోళనకు గురవుతున్నారు.

డబ్బులు ఇవ్వొద్దు 

హాస్పిటల్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌కు ఎవరూ డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా బలవంతంగా వసూలు చేస్తే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. వసూళ్ల ఆరోపణలపై ఇప్పటికే హెచ్చరించినం. గత నెలలో డెలివరీ పేషెంట్‌‌‌‌కు మూడో కాన్పు కావడం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉండడంతో కొంత ఇబ్బంది కలిగింది. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఫాలోఅప్‌‌‌‌ చేస్తున్నం. ఉన్న వనరుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నం.
-
 డాక్టర్‌‌‌‌ మధుసూదన్‌‌‌‌రెడ్డి, సూపరింటెండెంట్‌‌‌‌, ఎంసీహెచ్‌‌‌‌ జనగామ