జనగామలో టాస్క్​ఫోర్స్​ కమిటీ పనితీరుపై ఆరోపణలు 

  •     తెరవెనుక మామూళ్ల దందా 
  •     అక్రమ కట్టడాలు కాసులు కురిపిస్తున్నాయి.. 
  •     కూల్చివేతల ప్రక్రియపై అనుమానాలెన్నో
  •     కమిటీ సభ్యుల్లో కానరాని కోఆర్డినేషన్​

జనగామ, వెలుగు: అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపాల్సిన జనగామ జిల్లా టాస్క్​ ఫోర్స్​కమిటీ పనితీరు పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇదే టైంలో జనగామ జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ నిర్మాణాలు కొందరు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. పట్టణాల్లో ఆక్రమణలను అరికట్టేందుకు సర్కారు జిల్లా టాస్క్​ఫోర్స్ కమిటీని నియమించింది. ఈ కమిటీ నామమాత్రపు కూల్చివేతలకు పాల్పడుతూ తెరవెనక వసూళ్ల దందాలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.  డీల్​ కుదిరితే ఒకలా కుదరకుంటే మరోలా యాక్షన్​ తీసుకుంటున్నట్లు బాధితులు వాపోతున్నారు. ​ఇక కమిటీ సభ్యుల్లో కోఆర్డినేషన్​ లేకపోవడం మరో సమస్యగా మారింది. తాజాగా మున్సిపల్ కమిషనర్​ కంటతడి పెట్టడం అందుకు నిదర్శనం.

యథేచ్ఛగా అక్రమ కట్టడాలు 

జనగామ మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇదే సందర్భంలో కొందరు అధికారుల తీరుతో జనగామ జిల్లాకేంద్రంలో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రూల్స్​ ప్రకారం వ్యవహరించాల్సిన టాస్క్ ఫోర్స్ కమిటీ పేదోళ్లకో న్యాయం.. పెద్దోళ్లకు ఓ న్యాయం అన్నట్లు వ్యవహరిస్తోంది. కొత్త కలెక్టరేట్​ ఎదురుగా ఉన్న బతుకమ్మ కుంట హాట్​ కేక్​లా తయారైంది.  జనాలు సైతం ఇక్కడ ఇండ్లు కట్టుకునేందుకు ఇంట్రస్ట్​ చూపిస్తున్నారు. దీంతో కొందరుఅధికారులకు ఇది కాసులు కురిపిస్తోంది. 

అవినీతి ఫుల్​

అక్రమ నిర్మాణాలను అరికట్టే విషయంలో జిల్లా టాస్క్​ఫోర్స్​కమిటీ తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది.  ఇటీవల రెండో వార్డు పరిధిలో ఓ డెడ్​ ఎండ్​ ప్రహరీని టాస్క్ ఫోర్స్​​కమిటీ చైర్మన్​ దగ్గరుండి తొలగింపజేశారు. కానీ దానిని ఆనుకుని జరుగుతున్న కొత్త ఇంటి నిర్మాణ అనుమతులను ఏమాత్రం పరిశీలించకపోవడంపై  కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. అనుమతిచ్చిన దానికన్నా అదనంగా మరో అంతస్తు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. మరో వైపు సూర్యాపేట, హైదరాబాద్​ రోడ్ల వైపు వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలనీల్లో గతంలో అక్రమ నిర్మాణాల పేరుతో పలు నిర్మాణాలను స్వల్పంగా కూల్చి వదిలేయగా ప్రస్తుతం సదరు బిల్డింగ్ లను యథావిధిగా నిర్మిస్తున్నారు. 

కమిషనర్​ కంటతడితో బయటపడిన విభేదాలు 

అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో టాస్క్​ ఫోర్స్​ కమిటీ సభ్యుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చే మున్సిపల్​శాఖకు సమాచారం ఇవ్వడం లేదని కమిషనర్​ఇటీవల మీడియాకు వివరించారు. జిల్లా టాస్క్​ కమిటీ చైర్మన్​ ఆర్డీఓ మధుమోహన్​ తనను అటెండర్​ కంటే హీనంగా చూస్తున్నారని కలెక్టర్​ శివలింగయ్య ఎదుట సోమవారం కన్నీటి పర్యంతం కావడం అధికారుల మధ్య సమన్వయ లేమికి అద్దం పడుతోంది.

కమిటీ చైర్మన్​గా ఆర్డీఓ, ఏసీపీ, ఫైర్​ ఆఫీసర్, ఆర్అండ్​బీ శాఖ అధికారి సభ్యులుగా మున్సిపల్​ టౌన్​ ప్లానింగ్​ ఆఫీసర్​ సాయం తీసుకునేలా విధివిధానాలు ఉన్నాయి. కానీ కమిటీ కార్యకలాపాల్లో పూర్తి స్థాయి సభ్యులు పాల్గొనడం లేదు. వీరిలో కొందరు మాత్రమే కూల్చివేతల వద్దకు వెళ్తున్నట్లు సమాచారం. మధ్యవర్తులు, లీడర్లు ఎంటరై లావాదేవీలు సెట్​ చేస్తుండడంతో ఎక్కడి ఆక్రమణలు అక్కడనే ఉంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. 

నాకు సమాచారం ఇస్తలేరు 

పట్టణంలో అక్రమ నిర్మాణల కూల్చివేతలపై సమాచారం ఇవ్వడం లేదు. జిల్లా టాస్క్​ ఫోర్స్​ కమిటీలో టౌన్​ ప్లానింగ్​ ఆఫీసర్​ సభ్యుడిగా ఉంటారు. సదరు కమిటీ ఎక్కడ కూలుస్తున్నారు..? ఏమిటనేది కనీసం చెప్పడం లేదు. దీనిపై అడిగితే ​పట్టించుకోవడం లేదు. ఆర్డీఓ తీరుపై మున్సిపల్​ కమిషనర్స్​ యూనియన్​కు వివరిస్తా. -జంపాల రజిత, మున్సిపల్​ కమిషనర్

సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు

మున్సిపల్​ అనుమతులు సరిగా ఉన్నాయా లేవా..? రూల్స్​కు ప్రకారం నిర్మాణాలు జరుగుతున్నాయా..? లేదా అనేది నిగ్గు తేల్చేందుకే టాస్క్​ ఫోర్స్​ కమిటీ ఉంటుంది. మున్సిపల్​ అవినీతిని అరికట్టేందుకు కమిటీ పనిచేస్తుంది. అక్రమ నిర్మాణాలు అని తేలితే మేమే కూల్చివేతలు చేపడుతాం. ఇప్పటివరకు 30 నిర్మాణాలను కూల్చివేశాం. మున్సిపల్​ కమిషనర్​కు సమాచారం ఇవ్వాలని చట్టంలో లేదు. కూల్చివేత టైంలో టౌన్​ ప్లానింగ్​ ఆఫీసర్​ సాయం మాత్రమే తీసుకుంటాం. - మధుమోహన్​, ఆర్డీవో, జిల్లా టాస్క్​ఫోర్స్​ కమిటీ చైర్మన్​