ఐదో శక్తి పీఠంలో అస్తవ్యస్తం!..జోగులాంబ ఆలయంలో అవినీతి ఆరోపణలు

ఐదో శక్తి పీఠంలో అస్తవ్యస్తం!..జోగులాంబ ఆలయంలో అవినీతి ఆరోపణలు
  • అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలకు రికార్డుల్లేవు
  • భక్తుల కానుకలకూ బిల్లులు తీసుకుంటున్నారు
  • చక్రం తిప్పుతున్న ఓ అర్చకుడు
  • సామాన్య భక్తులకు సౌలతులు కరువు

గద్వాల, వెలుగు: ఐదో శక్తి పీఠం జోగులాంబ అమ్మవారి సన్నిధిలో ఆలయ పాలన గాడితప్పింది. అర్చకులు, ఆఫీసర్ల ముసుగులో కొంత మంది భారీ దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. భక్తులు అందిస్తున్న బంగారు, వెండి ఆభరణాలకు రికార్డులు నిర్వహించకపోవడం ఇందుకు ఊతమిస్తోంది. భక్తులు డొనేట్  చేసిన వస్తువులకు కూడా ఎండోమెంట్  ఆఫీసర్లు బిల్లులు పెట్టుకొని దండుకుంటున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ మొత్తం దందాలో ఓ అర్చకుడు చక్రం తిప్పుతున్నాడని,  వీఐపీలకు రెడ్  కార్పెట్  వేస్తూ  సామాన్య భక్తులకు ఎలాంటి సౌలతులు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే విమర్శలున్నాయి. ఈ ఫిర్యాదులు, ఆరోపణలపై స్పీకర్​ కార్యాలయం ఆదేశాల మేరకు ఎండోమెంట్​కమిషనర్, కలెక్టర్​ఎంక్వైరీ ప్రారంభించడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది.

బంగారం వెండి ఆభరణాలకు రికార్డుల్లేవ్..

రెండేండ్లుగా జోగులాంబ అమ్మవారి టెంపుల్  వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తోంది. లవ్  జిహాద్​కు సహకరించాడనే ఆరోపణలతో ఉద్యోగిని సస్పెండ్  చేయడం, ఎమ్మెల్యే సినిమాకు వెళ్లగా ఆలయంలో పని చేసే ఆర్చకుడు ఫొటోలు తీయడం తీవ్ర వివాదాస్పదమయ్యాయి. విలువైన ఆలయ భూములను కూడా అగ్గువకు లీజుకు ఇవ్వడం ద్వారా ఆలయ అధికారులు, ఆలయ కమిటీ పెద్దమొత్తంలో దండుకున్నారనే ఫిర్యాదులున్నాయి. ఇక  జోగులాంబ అమ్మవారికి భక్తులు ఇచ్చే గోల్డ్, సిల్వర్ ఆభరణాలకు అసలు రికార్డులే నిర్వహించకపోవడం వివాదాస్పదమవుతోంది. గోల్డ్, సిల్వర్, మిశ్రమం బంగారు ఆభరణాలు ఇచ్చే వారికి రిసిప్ట్ లు ఇచ్చి వాటికి రికార్డు మెయింటెన్​ చేయాలి. కానీ, రిసిప్ట్ లు ఇవ్వకుండా ఎవరు పడితే వారు తీసేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటివరకు బంగారం, వెండికి సంబంధించి ఎంత నిల్వ ఉందనే వివరాలు కూడా లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమ్మవారి ఆభరణాలు మాయమవుతున్నాయని డిసెంబర్  1న హైదరాబాద్ లోని ఎండోమెంట్  కమిషనరేట్  ముందు ధర్నా చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దాతలు ఇచ్చినవాటికీ బిల్లులు..

జోగులాంబ ఆలయంలో కొన్ని నెలల కింద హోమం  చేయగా, ఓ భక్తుడు 50 కేజీల నెయ్యిని దానం చేశాడు. కానీ, దానిని ఎండోమెంట్ తరపున కొనుగోలు చేసినట్లు బిల్లులు దండుకున్నారు. మరో డోనర్ 41(రూ.500 విలువైన ఒక్కో బల్బు) రీ చార్జెబుల్​ బల్బులు ఇస్తే వాటిని కూడా తామే కొనుగోలు చేసినట్లు బిల్లులు చేసుకున్నారు. నిత్యాన్నదానం కోసం 40 కేజీల కుక్కర్ ను డొనేట్  చేస్తే, దానిని కొనుగోలు చేసినట్లు డబ్బులు దండుకున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. అలాగే కర్నూల్  టౌన్   కల్లూరు లో ఆలయానికి చెందిన 15 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకే లీజుకు ఇచ్చారు. 15 ఎకరాలకు రూ.5 లక్షలు వచ్చే అవకాశముండగా, ఎకరాకు రూ.10 వేల నామమాత్రంగా లీజుకు ఇచ్చారు. ఎండోమెంట్ ద్వారా రైస్  మిల్లులకు గాని, కల్యాణ మండపాలకు కానీ లీజు పర్పస్  ఇవ్వవచ్చని భక్తులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, తాము అనుకున్న వారికి ధారాదాత్తం చేసేందుకు రికార్డుల్లో తక్కువ చూపి, మిగిలిన మొత్తాన్ని తాము స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో కమిటీ తీర్మానం లేకుండానే బైరాపురం చౌరస్తా, బూడిదపాడు చౌరస్తా దగ్గర ఆర్చీలు కట్టించి గుడి డబ్బులను పక్కదారి పట్టించారు.

చక్రం తిప్పుతున్న ఓ అర్చకుడు

ఆలయంలోని ఓ అర్చకుడు  అన్నీ తానై చక్రం తిప్పుతున్నాడు. బంగారం, వెండి కానుకలను పక్కదారి పట్టించడం, లెక్కలు గోల్​మాల్​చేయడంలో ఆయన పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. ఇటీవల అలంపూర్  ఎమ్మెల్యే కర్నూల్ లో ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే చాటుగా ఫొటోలు తీశాడు. గమనించిన ఆయన జిల్లా ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కు కంప్లైంట్ చేశారు. దీనిపై ఎంక్వైరీ చేయాలని కలెక్టర్, ఎండోమెంట్  శాఖలను  స్పీకర్ కార్యాలయం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన ఎండోమెంట్  కమిషనర్, కలెక్టర్  ఆలయంలో అక్రమాలు, అర్చకుడి పాత్రపై ఎంక్వైరీ చేస్తున్నారు.  నివేదిక అందిన తరువాత ఎలాంటి  చర్యలు తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది.

వీఐపీ భక్తుల సేవలో.. 

గుడికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి సౌలతులు, ప్రత్యేక దర్శనాల భాగ్యం కల్పించకపోయినప్పటికీ వీఐపీ భక్తులకు మాత్రం ఇక్కడి ఆఫీసర్లు, పూజారులు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు వచ్చాయంటే చాలు ఎండోమెంట్, అర్చకులు, కమిటీ వాళ్లు ఆహ్వాన కమిటీగా ఏర్పడి సీఎం, మంత్రులు,  ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఉన్నత స్థాయి అధికారుల చుట్టూ తిరుగుతూ ఆర్భాటాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు అర్చకులు ఆలయానికి వచ్చే వీఐపీ భక్తులను మచ్చిక చేసుకొని వారిచ్చిన కానుకలను ఇండ్లకు తరలించడం పరిపాటిగా మారింది. ఆలయానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా  సామాన్య భక్తులకు కనీసం ఒకపూట భోజన సౌకర్యం కూడా కల్పించడం లేదు. ఆఖరికి టాయిలెట్ కు వెళ్లాలన్నా రూ.5 చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. పార్కింగ్  పేరిట కూడా దోపిడీ జరుగుతోందని, ఎలాంటి ఫెసిలిటీస్​​కల్పించకుండా ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. 

నివేదిక రాగానే చర్యలు..

అర్చకుడిపై ఎండోమెంట్​ కమిషన్, కలెక్టర్​ దగ్గర విచారణ జరుగుతోంది.  నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. టాయిలెట్లకు డబ్బు వసూళ్లపై పరిశీలన చేస్తాం. అన్ని ఆరోపణలపైనా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం.
- మదనేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్  కమిషనర్  ఎండోమెంట్