పోస్టింగులు కోసం ఎదురు చూపులు

పోస్టింగులు కోసం ఎదురు చూపులు
  • కొడకండ్లకు ఎస్సై లేక నెల
  • జనగామ ఏసీపీ ఇన్​చార్జినే..
  • అడ్వకేట్లకు పోలీసులకు పొసుగుతలే..
  • వివాదాస్పదంగా పోలీసుల తీరు

జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో పోలీసింగ్ పట్టు తప్పుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఠాణాల్లో స్టాఫ్ కొరత, ఇక్కట్లకు తోడు బదిలీలు భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ట్రాన్స్ ఫర్ అయిన చోట కొత్త పోస్టింగ్ కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఇక్కడికి బదిలీపై వచ్చిన వారు కూడా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోతున్నారు. ఇలా వచ్చి అలా వెళ్తున్న పరిస్థితి. అడ్వకేట్లకు, పోలీసులకు మధ్య సయోధ్య కుదరక వివాదాస్పదంగా మారుతున్నాన్నట్టు ప్రచారం జరుగుతోంది. 

జనగామకు ఇన్​చార్జి ఏసీపీనే..

జిల్లా కేంద్రమైన జనగామ ఏసీపీ పోస్టింగ్ కూడా ఇన్​చార్జి పాలనలోనే కొనసాగుతోంది. జులైలో ఇక్కడ పనిచేసిన ఐపీఎస్ అధికారి అంకిత్ కుమార్ శాంఖ్వర్​బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి పార్థసారథి ఇన్​చార్జి ఏసీపీగా వ్యవహరిస్తున్నారు. రెండు నెలలు దాటినా పూర్తిస్థాయి పోస్టింగ్ ఇవ్వక పోవడంతో దీనిపైనా పోలీసుల్లో చర్చ జరుగుతోంది. కాగా, అంకిత్ కుమార్ కు ముందు ఇక్కడ ఏసీపీగా విధుల్లో చేరిన దామోదర్ రెడ్డి ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో మార్చి చివరి వారంలో బదిలీ అయ్యారు. ఆ సమయంలోనూ ఇప్పుడు ఇక్కడ ఏసీపీగా పనిచేస్తున్న పార్థసారధి కొద్ది రోజులు ఇన్​చార్జిగా కొనసాగారు. తదుపరి అంకిత్ కుమార్ విధుల్లో చేరడం మళ్లీ ఆయన మూడు నెలల వ్యవధిలోనే బదిలీ కావడంతో తదుపరి కూడా అదే పార్థసారథి ఇక్కడ ప్రస్తుతం ఇన్​చార్జిగా కొనసాగుతున్నారు.  

వివాదాల్లో పోలీసులు.. 

జనగామ పోలీసులు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. జనగామలో అడ్వకేట్ దంపతులకు పోలీసులకు మధ్య ఇటీవల జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్​లో ఏకంగా జనగామ టౌన్ సీఐ రఘపతి రెడ్డి, ఎస్సై తిరుపతిపై వేటు పడింది. సదరు సీఐ స్థానంలో దామోదర్ రెడ్డి ఇక్కడ ఎస్​హెచ్​వోగా బాధ్యతలు స్వీకరించారు.

కానీ, ఎస్సై స్థానంలో ఇప్పటివరకు ఎవరూ రాలేదు. కో ఆర్టినేషన్ సమస్యతోనే సదరు ఘటన జరిగిందన్న చర్చలు పోలీస్, అడ్వకేట్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశం మరిచిపోక ముందే కొద్ది రోజుల క్రితం జిల్లాలోనే పనిచేస్తున్న మరో పోలీసు అధికారి భార్య పోలీస్ వెహికల్ లో జనగామ కోర్టుకు హాజరుకావడం వివాదాస్పదంగా మారింది. అదే కోర్టులో పనిచేస్తున్న కొందరు ఫొటోలు తీసి మీడియాకు పంపారు. దీంతో పోలీస్​వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వాడడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా, ఇక్కడి పోలీసింగ్ ను గాడిలో పెట్టడంపై డీసీపీ రాజమహేంద్ర నాయక్ ప్రత్యేక దృష్టి 
సారించారు. 

కొడకండ్లకు ఎస్సై లేడు..

సుమారు నెల రోజులుగా కొడకండ్ల పోలీస్ స్టేషన్​కు ఎస్సై లేడు. ఇక్కడ పనిచేసిన ఎస్సై శ్రావణ్ ఇదే జిల్లా లింగాల ఘన్​పూర్ కు బదిలీపై వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు కొడకండ్లకు ఎస్సై పోస్టింగ్ ఎవరికీ ఇవ్వకపోవడంతో ఎస్సై లేకుండానే స్టేషన్ నిర్వాహణ జరుగుతోంది. సమీప మండలం దేవరుప్పుల ఎస్​హెచ్​వో సృజన్ కొడకండ్లకు ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్నారు. క్రైం తదితర ఎఫ్​ఐఆర్​లు చేయాల్సిన ఫిర్యాదులు వస్తే కొడకండ్లకు వెళ్లి వస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా శాంతి భద్రతలు, తదితర పనులను అక్కడి ఏఎస్సై పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.