- మంగళగూడెం నుంచి కోదాడకు అక్రమంగా తరలింపు
- రేషన్ బియ్యాన్ని లెవీగా రీసైకిల్ చేస్తున్నట్లు ఆరోపణలు
- తాజాగా రూరల్ మండలంలో 30 టన్నుల ధాన్యం పట్టివేత
ఖమ్మం/ఖమ్మం రూరల్, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న ధాన్యం పక్కదారి పడుతోంది. మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకొని, లెవీ కింద ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన సీఎంఆర్ కోసం రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పలు సొసైటీల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని అధికారులు రైస్ మిల్లులకు తరలించి అక్కడే నిల్వ చేస్తున్నారు. మిల్లు ఆడించిన తరువాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ సీఐ), సివిల్ సప్లై గోడౌన్లకు తరలించాల్సి ఉండగా, మిల్లర్లు, దళారులు అక్రమంగా పక్కదారి పట్టించి రూ. లక్షలు దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. తాజాగా ఖమ్మం రూరల్‍మండలం మంగళగూడెంలోని కన్నేటి నర్సింహారావు రైస్ మిల్లు నుంచి మంగళవారం రాత్రి రెండు లారీల ధాన్యాన్ని కోదాడకు తీసుకెళ్లారు. మూడో లారీలో ధాన్యం తీసుకెళ్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వరంగల్ క్రాస్‍రోడ్‍లో పట్టుకొని రూరల్ పోలీస్‍స్టేషన్‍కు తరలించారు.
ధాన్యం అమ్ముకుంటున్రు..
ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిర ధాన్యాన్ని మిల్లులకు తరలించిన తరువాత గడువులోగా మిల్లు ఆడించి ఎఫ్సీఐ, సివిల్ సప్లై గోడౌన్లకు తరలించకుండా ఇతర జిల్లాల్లోని మిల్లులకు తరలించి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకొని పీడీఎస్ బియ్యాన్ని కేజీ రూ. ఆరు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఆ బియ్యాన్ని పాలిష్ చేసి ఎఫ్సీఐ, సివిల్ సప్లై గోడౌన్లకు తరలిస్తున్నారు. ఇదే బియ్యం మళ్లీ గ్రామాల్లో రేషన్ దుకాణాలకు చేరుకుంటున్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ప్రభుత్వం రైతులకు మద్దుతు ధర ఇవ్వడం కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టి ధాన్యం కొనుగోలు చేస్తుంటే, ఆ ధాన్యంతో మిల్లర్లు రూ.కోట్లు వెనుకేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
తనిఖీలు చేయకపోవడంతోనే..
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేసిన సమయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకపోవడం వల్ల, నిల్వ ఉన్న ధాన్యానికి, సీఎంఆర్ కింద ఇచ్చిన బియ్యానికి లెక్క తేలడం లేదు. మిల్లు ఆడించి బియ్యాన్ని గోడౌన్లను పంపించడానికి మిల్లర్లకు కొంత సమయం ఇస్తున్నారు. ఈ సమయంలో సివిల్ సప్లై అధికారులు, ఎఫ్సీఐ ఆఫీసర్లు పర్యవేక్షించడం లేదు. దీన్ని అదునుగా తీసుకుంటున్న మిల్లర్లు, వ్యాపారులు సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. గతేడాది ఏదులాపురం సొసైటీలో దాదాపు రూ.కోటి విలువైన ధాన్యం పక్కదారి పట్టిందని సహకార శాఖ అధికారులు నిర్వహించిన 51 ఎంక్వైరీ లో తేలింది. అసలు ధాన్యం కొనుగోలు చేయకుండానే ట్రక్‍షీట్లు చూపించి, లెవీ కింద రేషన్ బియ్యాన్ని సప్లై చేసినట్టు గుర్తించారు. ఇందులో భాగంగా రూరల్ మండలంలో రెండు రైస్‍మిల్లులను ఆఫీసర్లు సీజ్‍చేశారు. అయినా, మిగిలిన మిల్లర్ల అక్రమాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. సివిల్ సప్లై అధికారులు కూడా లోపాయికారిగా సహకరిస్తుండడం వల్లే అక్రమాలు బయటపడకుండా ఉంటున్నాయన్న ఆరోపణలున్నాయి.
సివిల్ సప్లై ఆఫీసర్ల తనిఖీలు
మంగళవారం పట్టుకున్న ధాన్యానికి సంబంధించి మంగళగూడెంలోని కన్నేటి నర్సింహారావు రైస్‍మిల్లులో బుధవారం సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత వ్యవసాయ సీజన్‍లో జిల్లాలో లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇందులో దాదాపు 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ రైస్‍మిల్లుకు పంపించినట్టు తెలుస్తోంది. ఆ ధాన్యం మొత్తానికి సంబంధించిన స్టాక్‍ను పరిశీలించారు. పోలీసులు పట్టుకున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిందేనా లేదా మిల్లరు సొంతంగా కొనుగోలు చేసిన ధాన్యమా అనేది స్టాక్ ఉన్న ధాన్యం, మర ఆడించిన బియ్యం, ఇప్పటికే సివిల్ సప్లైకు సరఫరా చేసిన బియ్యాన్ని పరిశీలించిన తర్వాత లెక్క తేలుస్తామని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యమే అని తేలితే మిల్లర్‍పై చర్యలు తీసుకుంటామని అంటున్నారు.