న్యూఢిల్లీ: షేర్ల కొనుగోలు ఒప్పందంలోని నిబంధనలను అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ ఉల్లంఘించిందని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆరోపిస్తోంది. ఇందుకుగాను రూ. 13,400 కోట్లు (1.7 బిలియన్ డాలర్లు) చెల్లించాలని ముంబై సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ (ఎంసీఐఏ) వద్ధ కేసు ఫైల్ చేసింది. డీల్‌లోని ఏ నిబంధనలను అదానీ ట్రాన్స్‌మిషన్ ఉల్లంఘించిందో మాత్రం కంపెనీ ప్రకటించలేదు. కాగా, ముంబైలోని పవర్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌ను కొనుగోలు చేయడానికి రిలయన్స్ ఇన్‌ఫ్రాతో రూ.18,800 కోట్ల డీల్‌ను అదానీ ట్రాన్స్‌మిషన్ 2017 లో కుదుర్చుకుంది. ఈ డీల్‌తో ముంబైలో పవర్ డిస్ట్రిబ్యూషన్‌లో అదానీ గ్రూప్ విస్తరించడానికి వీలైంది.
రిలయన్స్ ఇన్‌ఫ్రా ఎంసీఐఏలో వేసిన పిటిషన్‌పై అదానీ ట్రాన్స్‌మిషన్ స్పందించింది. ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్‌లో నిజాలతో స్పందిస్తామని, రిలయన్స్ ఇన్‌ఫ్రాకు వ్యతిరేకంగా తమ క్లయిమ్స్‌ను కూడా బయటపెడతామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరు సోమవారం సెషన్‌లో 7 శాతం లాభపడి రూ.174 వద్ద క్లోజయ్యింది. అదానీ ట్రాన్స్‌మిషన్ షేరు 1.29 శాతం ఎగిసి రూ. 3,982 వద్ద ముగిసింది.