వనపర్తి , వెలుగు : వనపర్తి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని పెద్దమందడి, ఖిల్లాగణపురం, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు, మదనాపురం, వీపనగండ్ల, పెబ్బేరు, పాన్ గల్ మండలాల్లోని వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వం జిల్లాలో ఇసుక రీచ్ లను ఏర్పాటు చేసింది. అయితే ఆయా మండలాల రెవెన్యూ, పోలీసు అధికారులు అక్రమార్కుల నుంచి మామూళ్లు తీసుకుంటూ ఈ దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రూ.3,500 కు ట్రాక్టర్ ఇసుకను అందించాలి. అయితే వినియోగదారుల నుంచి వీరు రూ.1000 అదనంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వ రీచ్ లలో ఇసుక నాణ్యత ఉండదని, మంచి ఇసుక తెస్తామని వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక ట్రిప్ కు రాయల్టీ కట్టి ఐదారు ట్రిప్ ల ఇసుక తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ యజమాని నెలకు రూ.30 వేల వరకు ఈ రెండు శాఖలకు ఇస్తున్నామని బహిరంగంగా చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రాత్రి పూట అక్రమ తరలింపు..
రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇసుక తరలిస్తున్నారు. పెద్దమందడి మండలంలో సోమవారం రాత్రి ఎదురుగా వస్తున్న బైక్ ను ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టడంతో కొత్తకోటకు చెందిన వహీద్ అక్కడికక్కడే చనిపోగా, మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. లైట్లు లేకుండా ఇసుక లోడ్ తో వేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఇంత జరిగినా పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు స్పందించక పోవడంపై విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్కు ‘కృష్ణా’ ఇసుక
పెబ్బేరు మండలంలోని రంగాపూర్ గ్రామ సమీపంలోని కృష్ణా నది నుంచి ప్రతి రోజూ ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ పాలసీ రూపొందించింది. దీనిని అమలు చేసి ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి న్యాయం చేయడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారనే విమర్శలున్నాయి. కృష్ణా నది ఒడ్డున డంప్ లను ఏర్పాటు చేసి హైదరాబాద్ కు లారీలు, టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నారు. గుర్రంగడ్డ, రంగాపూర్, రాంపూర్, సూగూరు తదితర గ్రామాల నుంచి ఇసుక తీసుకెళ్తున్నారు. మంగళవారం రాత్రి గుర్రంగడ్డ నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. మదనాపూర్, ఆత్మకూరు, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఆత్మకూరు మండలం రేచింతలతో పాటు ఊకచెట్టువాగు తీర గ్రామాల్లో ఇసుక నిల్వ చేశారు. మదనాపురం మండలం కొత్తపల్లి, కర్నె, బాలకిష్టాపురం శివారులో ఇసుక డంపులు ఉన్నా పోలీసులు పట్టించుకోవడంలేదు.
చర్యలు తీసుకుంటాం..
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ, మైనింగ్ అధికారుల నుంచి వివరాలు తీసుకొని దాడులు నిర్వహిస్తాం. పర్మిట్ చూపిస్తూ ఎక్కువ మొత్తంలో ఇసుక డ్రా చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ చేపడతాం. పెద్దమందడి వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్ యజమాని, డ్రైవర్ పై కేసు నమోదు చేసి ట్రాక్టర్ సీజ్ చేశాం. రాత్రి ఇసుక తరలించేందుకు అనుమతి లేదు. సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.
- ఆనంద్ రెడ్డి డీఎస్పీ, వనపర్తి