జననం.. మరణం ఫేక్​ సర్టిఫికెట్ల మయం.. జీహెచ్ఎంసీ ఆఫీసర్లు, ఔట్​సోర్స్​ సిబ్బందిపై ఆరోపణలు ..

జననం.. మరణం ఫేక్​ సర్టిఫికెట్ల మయం.. జీహెచ్ఎంసీ ఆఫీసర్లు, ఔట్​సోర్స్​ సిబ్బందిపై ఆరోపణలు ..
  • ఇదివరకే విచారణకు ఆదేశించిన కమిషనర్​
  • సెక్షన్ ఆఫీసర్లు, సిబ్బందిని ఎంక్వైరీ చేస్తున్న విజిలెన్స్, ఇంటెలిజెన్స్  
  • 2018 నుంచి 10 లక్షల సర్టిఫికెట్ల జారీ  
  • కరోనా టైంలో ఇచ్చిన వాటిపై ఫోకస్​

హైదరాబాద్ సిటీ, వెలుగు:జీహెచ్ఎంసీ బర్త్ అండ్ డెత్ సెక్షన్ లో పనిచేస్తున్న ఆఫీసర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది కొందరు ఫేక్​సర్టిఫికెట్ల దందా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డిపార్ట్​మెంట్​లో పని చేసే ఆపరేటర్లు, కొంతమంది మెడికల్​ఆఫీసర్లు, మరికొంతమంది సిబ్బంది కలిసి డబ్బులు దండుకుంటూ ఫేక్​సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నారని తెలియడంతో కొద్ది రోజుల కింద కమిషనర్​ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్టేట్ విజిలెన్స్, ఇంటెలిజెన్స్ ఫోకస్ పెట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్లు, సిబ్బందిని విచారణ చేస్తోంది. ఈ నెలాఖరు వరకు ఎంక్వైరీ పూర్తి చేసి నివేదికను సర్కారుతో పాటు కమిషనర్​కు సమర్పించనున్నట్టు సమాచారం. 

ఆపరేటర్ల చేతిలోనే అంతా...

బల్దియాలో ఏటా సుమారు లక్షా50 వేల బర్త్ సర్టిఫికెట్లు, 60 వేల వరకు డెత్ సర్టిఫికెట్లు జారీ అవుతుంటాయి. ఇలా 2018 నుంచి ఇప్పటివరకు దాదాపు 10 లక్షల వరకు సర్టిఫికెట్లు జారీ చేశారు. ఇందులో అత్యధికంగా డెత్ సర్టిఫికెట్లు కరోనా సమయంలోనే జారీ అయ్యాయి. బర్త్ అండ్ డెత్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 32 మంది ఆపరేటర్లు పని చేస్తుండగా, ఇందులో కొందరు ఏండ్లుగా పాతుకుపోయారు. కరోనా టైంలో డబ్బులకు ఆశపడి ఎక్కువ శాతం ఫేక్​సర్టిఫికెట్లు జారీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. 

దీనికి సంబంధించి కమిషనర్​సర్కిల్ స్థాయి ఆఫీసర్లతో సమావేశం నిర్వహించగా ఆపరేటర్ల నుంచే జారీ అవుతున్నట్లు తెలిసింది. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు బర్త్ అండ్ డెత్ సెక్షన్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై నిఘా పెట్టారు. కొందరికి ఫోన్లు చేసి, మరికొందరిని ఆఫీసులతో పాటు ఇండ్లకు వెళ్లి ఎంక్వైరీ చేస్తున్నారు. ఉద్యోగంలో చేరే టైంలో ఆర్థికంగా వారి పరిస్థితి ఏమిటి? ఇప్పుడెలా ఉన్నారు అన్నది ఆరా తీస్తున్నారు.  

తర్వాత మెడికల్ ఆఫీసర్ల వంతు..

బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి మెడికల్ ఆఫీసర్లదే కీలక బాధ్యత. అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత వారే ఫైనల్​అప్రూవల్​ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, వీరు సరిగ్గా పనిచేయకుండా ఆపరేటర్లకి అప్పజెప్తుండడంతో తప్పులు జరుగుతున్నాయి. కొందరు మెడికల్ ఆఫీసర్లయితే ఏకంగా పర్సనల్  ఐడీలు, పాస్ వర్డ్ లు కూడా చెప్తుండడంతో అక్రమాలు పెరుగుతున్నాయి. 

ఆపరేటర్ల తర్వాత కొందరు మెడికల్ ఆఫీసర్లు కూడా డబ్బులకు ఆశపడి రూల్స్​బ్రేక్​చేస్తూ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు ఆపరేటర్ల విచారణలో ఈ విషయాన్ని బయటపెట్టినట్టు సమాచారం. అందుకే ఆపరేటర్ల విచారణ తర్వాత సర్కిల్​లెవెల్​లో మెడికల్ ఆఫీసర్లు, బాధ్యులైన ఇతర ఆఫీసర్లను విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

చార్మినార్ లోనే ఎక్కువ సమస్య..

బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లకి సంబంధించి చార్మినార్ జోన్ లోనే సమస్య ఎక్కువగా ఉంది. మూడేండ్ల కింద ఇదే జోన్ లో డబ్బులు తీసుకొని ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు నలుగురు ఆపరేటర్లను టెర్మినేట్​చేశారు. ఇందుతో చార్మినార్ సర్కిల్ లో ముగ్గురు, చంద్రాయణగుట్టలో ఒకరు ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచే అత్యధికంగా ఫేక్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి.  ఇందులో ఓ అధికారి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. 

ఇన్ స్టంట్ అప్రూవల్ తో పరేషాన్ 

హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ తదితర సెంటర్లలో పుట్టిన, చనిపోయినా వెంటనే సర్టిఫికెట్లు పొందే అవకాశం ఉండేది కాదు. అన్ని స్థాయిల్లో పరిశీలించిన తర్వాతే అప్రూవల్ లభించేది. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా నెలలు పట్టేది. దీంతో ఈ పద్ధతి కాకుండా వెంటనే సర్టిఫికెట్లు ఇచ్చేలా బల్దియా ఇన్ స్టంట్ అప్రూవల్ సిస్టమ్​ను తీసుకొచ్చింది. పుట్టిన, చనిపోయిన హాస్పిటల్స్, సెంటర్ల సిబ్బందికి బల్దియా లాగిన్ ఐడీలు ఇవ్వడంతో సర్టిఫికెట్లకు అప్రూవల్ఇస్తున్నారు. వీటితో మీసేవా కేంద్రాలకు వెళ్తే సరిపోతుంది.

ఈ పద్ధతిలో జీహెచ్ఎంసీ ఆఫీసర్ల ప్రమేయం లేకుండానే సర్టిఫికెట్లు ఇష్యూ అవుతున్నాయి. సర్టిఫికెట్లు తొందరగా వస్తున్నా అక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ. హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకోకపోయినా డెత్ సర్టిఫికెట్లు పొందొచ్చు. ఇక హోం బర్త్, డెత్ లకి సంబంధించి బల్దియా అధికారులే విచారణ జరిపి అప్రూవల్స్ ఇస్తున్నా ఇక్కడా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.