
మహబూబాబాద్, వెలుగు : తన భర్త ఎడబోయిన భుజంగరావుపై మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత అక్రమ కేసులు బనాయింపజేశారని ఆదివారం కురవి–-మహబూబాబాద్ జాతీయ రహదారిపై ఎడబోయిన జ్యోతి అనే మహిళ గ్రామస్థులతో కలిసి రాస్తారోకో చేశారు. బేతోల్ గ్రామంలో నిర్వహించిన ఆందోళనలో జ్యోతి మాట్లాడుతూ తన భర్త భుజంగరావు, ఎంపీ కవిత అనుచరుడైన సత్యనారాయణకు మధ్య గొడవ జరిగిందని, దీన్ని పరిష్కరించాలని ఎంపీ వద్దకు వెళ్లగా ఆమె తన అనుచరుడైన సత్యనారాయణకు అనుకూలంగా మాట్లాడారని ఆరోపించింది.
అంతేగాక తన భర్తపై కురవి మండల పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేసింది. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి రాస్తారోకో విరమింప చేశారు. అయితే మహబూబాబాద్ఎమ్మెల్యే బానోతు శంకర్నాయక్వర్గీయులు కావాలనే మహిళలను రెచ్చగొట్టి ఆందోళన చేయించారని ఎంపీ కవిత వర్గీయులు ఆరోపించారు.