- నారాయణపేట జిల్లాలో రూ.2.37 కోట్ల అక్రమాలు
- కలెక్టర్‌కు గ్రామస్తుల కంప్లైంట్
- కన్మనూరు ఫీల్డ్ అసిస్టెంట్, ఏపీవో సస్పెన్షన్
మహబూబ్‌నగర్/నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరికల్ మండలం కన్మనూరు గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మతీన్, పై స్థాయి ఆఫీసర్లతో కలిసి అవినీతికి పాల్పడినట్లు తెలిసింది. చేయని పనులు చేసినట్లు బిల్లులు, రికార్డులు సృష్టించడంతో పాటు స్టూండెంట్లు, నిరుద్యోగుల పేర్ల మీద జాబ్ కార్డులు జారీ చేసి నిధులు దండుకున్నట్లు తెలిసింది. ఇలా మూడేండ్లుగా రూ.2.37 కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని నారాయణపేట కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి.
71 పనుల్లో అక్రమాలు!
మతీన్ గతం నుంచి ఇక్కడ పని చేసిన అధికారులతో సఖ్యతగా ఉండేవాడు. వారి సహకారంతో అక్రమాలకు తెరలేపాడు. వచ్చిన దాంట్లో కొంత ఆఫీసర్లకు కూడా ముట్టజెప్పేవాడని తెలిసింది. ప్రధానంగా ఎన్ఆర్ఈజీఎస్లో కాంపోనెంట్వర్క్ కింద కూలీలకు చెల్లించాల్సిన పేమెంట్లను స్టూడెంట్లు, నిరుద్యోగుల అకౌంట్లలోకి.. మెటీరియల్ కాంపోనెంట్ కింద చెల్లించే పేమెంట్లను జీపీ అకౌంట్లలోకి కాకుండా నేరుగా తన సొంత అకౌంట్లలోకి మళ్లించుకున్నట్లు తెలిసింది.
ప్రధానంగా కోయిల్‌సాగర్, మన్నెవాగు, తదితర కాలువల కట్టలు పెంచడం, క్యాటిల్ షెడ్లు, నీటి నిల్వ చెరువులు, అవెన్యూ ప్లాంటేషన్, అగ్రికల్చర్ గోడౌన్, వర్క్ ఫెడ్లు, విలేజ్ పార్క్, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వర్కులు, కల్లాల నిర్మాణం, కంపోస్ట్ పిట్లు, కిచెన్ కం స్టోర్లు, శ్మశానవాటికలు వంటి 71 పనుల్లో రూ.2.37 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు కలెక్టర్‌కు అందిన కంప్లైంట్లో ఉన్నాయి. దీనిపై విచారణ చేసిన ఆఫీసర్లు 57 రకాల పనుల్లో అక్రమాలు జరిగినట్లు అంచనాకు వచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఇద్దరిని సస్పెండ్ చేశారు.
జాబ్ కార్డులు సృష్టించి..
ఎన్ఆర్ఈజీఎస్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికే జాబ్ కార్డు ఇవ్వాలి. కానీ, మతీన్ తనకు తెలిసిన వారందరికీ జాబ్ కార్డులు ఇప్పించినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన యువకులు హైదరాబాద్‌లో చదువుకుంటుండగా, వారి పేర్ల మీద, గ్రామంలో ఖాళీగా ఉండే వారి పేర్ల మీద జాబ్ కార్డులు తీయించినట్లు తెలిసింది. వాస్తవానికి ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఈ పనులు చేయాల్సి ఉండగా.. ఆయనకు తెలియకుండానే ఉన్నాధికారుల సహకారంతో ఇష్టం వచ్చిన వారి పేర్ల మీద జాబ్ కార్డులు సృష్టించారు. అంతటితో ఆగకుండా స్కీమ్‌లో వీరు కూలీ పనులు చేయకున్నా.. చేసినట్లు బిల్లులు చేసి వారి అకౌంట్లలోకి డబ్బులు వేశారు. ఆ తర్వాత వారి నుంచి ఆన్లైన్ పేమెంట్ల ద్వారా తిరిగి తన అకౌంట్లోకి డబ్బులు వేయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన స్ర్కీన్ షాట్లు కూడా కలెక్టర్‌కు అందించిన కంప్లైంట్లో ఉన్నాయి.
ఇంట్లోనే రికార్డులు..
కన్మనూరు గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకానికి సంబంధించిన రికార్డులు మరికల్ ఎంపీడీవో ఆఫీసులో ఉండాల్సి ఉండగా.. కొంత కాలంగా మతీన్ తన ఇంటి వద్దనే ఉంచుకున్నాడనే ఆరోపణలున్నాయి. దాదాపు నాలుగైదు ఏండ్ల నుంచి ఇదే తంతు కొనసాగినట్లు సమాచారం.
అయితే కన్మనూరు గ్రామానికి చెందిన కొందరు యువకులు మతీన్ తీరుపై అనుమానం వచ్చి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులు, వాటి వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నారు. దీంతో అలర్ట్ అయిన ఆఫీసర్లు వెంటనే రికార్డులు అప్పగించాలని మతీన్‌ను ఆదేశించడంతో అప్పటికప్పుడు ఆయన మండల ఆఫీసులో రికార్డులు అందజేసినట్లుతెలిసింది.
పూర్తి వివరాలు సేకరిస్తున్నాం..
కన్మనూరులో 71 వర్క్స్ఐడీల మీద అక్రమాలు జరిగాయని కంప్లైంట్లు వచ్చాయి. వర్క్ ఐడీల్లో కొన్ని ఒకే రకంగాఉన్నాయి. 57 వర్క్ ఐడీలను తేల్చాము. ఇందులో కొన్ని వర్క్స్ జరిగాయి. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి డబ్బులు వేశారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నాం. ఎవరెవరి పీరియడ్‌లో అక్రమాలు జరిగాయనే విషయాన్ని తేల్చుతాం. అనంతరం నిధులను రికవరీ చేస్తాం. పూర్తి రిపోర్డ్ వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం కన్మనూరు ఫీల్డ్ అసిస్టెంట్ మతీన్, గతంలో ఇక్కడ ఏపీవోగా పని చేసిన చంద్రశేఖర్ ను సస్పెండ్ చేశాం.–మొగులప్ప, డీఆర్డీవో, నారాయణపేట