- అధికార పార్టీ అండతో రాత్రి వేళల్లో మాఫియా ఆగడాలు
- పంట పొలాల మీదుగా వెళ్తున్న ట్రాక్టర్లు
వనపర్తి,పెద్దమందడి, వెలుగు: వనపర్తి జిల్లాలోని పలు వాగుల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోంది. అధికార పార్టీ అండదండలతో పాటు అక్రమార్కుల నుంచి మామూళ్లు తీసుకుంటున్న ఆఫీసర్లు ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవటం లేదనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రీచ్ లను గుర్తించి రాయల్టీ చెల్లించిన వారికి ఇసుక అందిస్తోంది. అనుమతుల ముసుగులో కొందరు 2 ట్రాక్టర్లకు పర్మిషన్ తీసుకుని 10 ట్రిప్పులు కొడుతున్నారు. ఇది చాలదన్నట్లు రాత్రి వేళల్లో రైతుల పొలాల మీదుగా ఇసుకను అక్రమంగా గ్రామాలకు చేరుస్తున్నారు.
స్పందించని ఆఫీసర్లు..
పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి వాగు నుండి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులకు, డయల్ 100కు ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇసుక రవాణాను అడ్డుకుంటే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిలకటోనిపల్లి వాగు నుంచి ప్రతిరోజు 30 ట్రాక్టర్లతో రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్లు ఓవర్ స్పీడు, అధిక లోడుతో వెళ్లడంతో ప్రజలు బలవుతున్నారు. గతంలో ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ ఢీకొని చనిపోయారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు అంటున్నారు. జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత, పానగల్, ఖిల్లా ఘనపురం, మదనాపురం, పెబ్బేరు, వనపర్తి, కొత్తకోట మండలాల్లో ఇసుక ధరలను అమాంతం పెంచేసి సామాన్యులను దోచుకుంటున్నారు. గవర్నమెంట్ వర్క్స్, పీహెచ్సీల నిర్మాణం పేరుతో కొద్ది రోజులుగా ఇసుకను తరలిస్తూ లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారు.
గ్రామాల్లో ఇసుక డంపులు
చిన్నచింతకుంట: మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఊకచెట్టువాగు నుంచి అధికార పార్టీ నాయకులు ఇసుక తరలిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. మద్దూరు, ముచింతల గ్రామాల నుంచి అర్ధరాత్రి ఇసుకను నారాయణపేట, వనపర్తి, పాలమూరుకు ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుకను దూరాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ. 7 వేల వరకు అమ్ముతున్నారు. దీనిపై ఎవరైనా నిలదీస్తే వారిపై అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. మద్దూర్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కలిసి ఈ దందా చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. మద్దూర్, ముచింతల మధ్యలో రోడ్డు పక్కనే ఇసుకను డంప్ చేశారు. ఇంత బహిరంగంగా ఇసుక దందా చేస్తున్నా, విషయం తమకు తెలియదని అధికారులు చెబుతున్నారు. ముచ్చింతల నుంచి దేవరకద్ర మీదుగా హైదరాబాద్, నారాయణపేటకు ఓ అధికార పార్టీ నేత ప్రతిరోజు ఇసుక తరలిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఈ విషయమై చిన్నచింతకుంట తహసీల్దార్ సువర్ణ రాజును వివరణ కోరగా, అక్రమంగా ఇసుక రవాణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.