కొండాపూర్​లో భూమి గుంజుకుంటున్నరని..రైతు ఆత్మహత్యాయత్నం

  •     అధికారుల ముందేపురుగుల మందు తాగి నిరసన
  •     రాజన్నసిరిసిల్ల జిల్లా కొండాపూర్​లో ఘటన 

కోనరావుపేట, వెలుగు :  ప్రభుత్వం తనకిచ్చిన భూమిని రెవెన్యూ అధికారులు లాక్కుంటున్నారని ఆరోపిస్తూ వారి ముందే పురుగులు మందు తాగి ఓ రైతు ప్రాణం తీసుకోబోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ మల్యాల నందం(42) గతంలో జనశక్తిలో పనిచేసి టీడీపీ ప్రభుత్వ హయాంలో లొంగిపోయాడు.

అందుకు ఆయనకు 2013లో కొండాపూర్​శివారులోని  సర్వే నం.116 1/2లో అప్పటి సర్కారు 2 ఎకరాల భూమి కేటాయించి, పట్టా ఇచ్చింది. పదేండ్లుగా ఆ భూమిని సాగుచేసుకుంటున్నాడు. కొంతకాలంగా రెవెన్యూ అధికారులు తన భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ భూమిని ఫారెస్ట్​డిపార్ట్​మెంట్​కు అప్పగిస్తామని చెప్తున్నారని నందం తెలిపారు.

తహసీల్దార్ విజయప్రకాశ్​రావు, డీటీ, పోలీస్ సిబ్బందితో కలిసి వెళ్లి జేసీబీతో కందకం తీస్తుండగా బాధిత రైతు వారి ముందే పురుగుల మందు తాగాడు. వెంటనే  అధికారులు ఆయనను సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కు తరలించారు. 

లంచం ఇవ్వనందుకే..  

తన భూమిని ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​కు హ్యాండోవర్ చేయొద్దంటే రూ.50 వేలు ఇవ్వాలని సర్వేయర్ డిమాండ్ చేసినట్టు నందం భార్య పద్మ ఆరోపించారు. తన భర్త డబ్బులు ఇవ్వనందుకే అధికారులు  భూమిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

మల్యాల నందం పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో భూమి లేదని తహసీల్దార్ విజయ్ ప్రకాశ్‌‌ తెలిపారు.  కొండాపూర్ శివారులోని116 సర్వే నంబర్​లో ఉన్న భూమిని ఫారెస్ట్ కు హ్యాండోవర్ చేయాల్సి ఉందని, సోమవారం జేసీబీతో హద్దుల ఏర్పాటు చేసేందుకు కందకం తీస్తుండగా ఆయన పురుగుల మందు తాగారని చెప్పారు.