- అనుచరులతో కలిసి దాడి చేయించి
- రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో బాధితుల ధర్నా
- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఘట్కేసర్, వెలుగు: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తమ భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో బాధితులు నిరసన చేపట్టారు. కబ్జా చేసిన భూమిలోనే సోమవారం ధర్నాకు దిగి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పల్లా అనుచరులు అకారణంగా తమపై దాడి చేశారని బాధితులు మండిపడ్డారు.
కుంట్లూరు గ్రామ మాజీ సర్పంచ్ కల్లెం ప్రభాకర్ రెడ్డి, రాజేశ్, శివారెడ్డి, సాయి సిద్ధార్థ మాట్లాడుతూ.. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామ పరిధి సర్వే నంబర్ 796లో నీలిమ హాస్పిటల్ సమీపంలో నాలుగు ఎకరాల తమ పట్టా భూమిని పల్లా రాజేశ్వర్ రెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జా బాగోతాన్ని మీడియాకు వివరిస్తుంటే పల్లా అనుచరులు, నీలిమ హాస్పిటల్ సిబ్బంది తమపై దాడి చేశారన్నారు. ప్రెస్‌మీట్‌ను అడ్డుకుని నానా హంగామా సృష్టించారని మండిపడ్డారు. అధికా రంలో ఉంటూ బెదిరింపులకు గురి చేశారని ఆరోపించారు. తమది పట్టా భూమి అని వివరించారు.
భూమి దక్కేదాకా పోరాటం చేస్తామని తేల్చి చెప్పా రు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ సర్వే నంబర్ 813లోని నాడెం చెరువు బఫర్ జోన్లో నీలిమ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ నిర్మించారని ఆరోపించారు. దాడికి నిరసనగా బాధి తులు నీలిమ హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. వీడియోలు తీస్తున్న జర్నలిస్టులతో పల్లా అనుచరులు దురుసుగా ప్రవర్తించారు.
విషయం తెలుసుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. జర్నలిస్టులు కూడా నిరసనకు దిగడంతో పల్లా అనుచరులు వచ్చి సారీ చెప్పారు. పల్లా అనుచరులు పల్లా సతీశ్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, రామారావుతో పాటు మొత్తం పది మందిపై బాధితులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.