హైదరాబాద్​లో అలెగ్రో ఆర్​ అండ్​ డీ సెంటర్​

  • రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్న సంస్థ 
  • 500 మందికి ఉపాధి: మంత్రి శ్రీధర్​ బాబు

హైదరాబాద్​, వెలుగు: ఆటోమోటివ్, ఎలక్ట్రిక్​ వెహికల్స్​లో వాడే మ్యాగ్నెటిక్, సెన్సర్లు, చిప్​లను తయారు చేసే దిగ్గజ సంస్థ అలెగ్రో మైక్రోసిస్టమ్స్​ హైదరాబాద్​లో పరిశోధన, అభివృద్ధి (ఆర్​ అండ్​ డీ) సెంటర్​ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. శుక్రవారం సెక్రటేరియెట్​లో మంత్రి శ్రీధర్​బాబుతో సంస్థ ప్రతినిధులు ఎంవోయూ చేసుకున్నారు. అనంతరం మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడారు.

సంస్థ ఆర్​ అండ్​ సెంటర్​ ఏర్పాటుతో 500 మంది ప్రతిభావంతులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో సంస్థ హైదరాబాద్​లో ఆర్​ అండ్​ డీ సెంటర్​ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అల్లెగ్రో రాకతో రాష్ట్రంలో సెమీకండక్టర్​ చిప్​ల తయారీ పరిశ్రమకు ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్​ వెహికల్స్​ సిగ్నల్ డిజైన్, వెరిఫికేషన్, వ్యాలిడేషన్ తోపాటు రోబోటిక్ ఆటోమేషన్ లో కూడా అలెగ్రో చిప్ లను రూపొందిస్తుందని చెప్పారు. బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్​ కార్ల తయారీ సంస్థతో పాటు ఈవీ రంగంలో బ్యాటరీల నిర్వహణ, పవర్ చిప్ ల తయారీలో ఈ సంస్థ అగ్రగామిగా ఉందన్నారు. కార్యక్రమంలో అలెగ్రో మైక్రోసిస్టమ్స్ సీఈవో వినీత్ నర్గోల్వాలా, సీనియర్ వైస్​ ప్రెసిడెంట్​లు సుమన్ నారాయణ్, మ్యాక్స్ గ్లోవర్ పాల్గొన్నారు.