హైదరాబాద్, వెలుగు: మన్మోహన్ సింగ్ టాలెంట్ ను గుర్తించి తెలుగు బిడ్డ పీవీ నర్సింహారావు అవకాశాలు ఇచ్చారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ‘‘ప్రధానిగా చేసిన పీవీకి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్న ఇవ్వలేదు. మోదీ సర్కార్ ఇచ్చింది. పీవీ అంత్యక్రియలకు సోనియా గాంధీ అటెండ్ కాలేదు. పీవీ మీద నాడు కాంగ్రెస్ కక్ష కట్టింది. పీవీకి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు చేయలేదు. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఆర్డినెన్స్ తీసుకొస్తే రాహుల్ గాంధీ చించేశారు.
సంతాప దినాలు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వియత్నాం వెళ్లిండు” అని అసెంబ్లీలో ఆయన విమర్శించారు. దీనికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం గురించి మాట్లాడాలంటే.. రాజకీయాలు మాట్లాడటం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదనే విషయం గుర్తుంచుకోవాలని ఏలేటికి సూచించారు. సంతాప తీర్మానం గురించి మాట్లాడాలని ఏలేటికి స్పీకర్ సూచించారు.
తిరిగి రాహుల్ గాంధీ గురించి ఏలేటి మాట్లాడబోగా.. సంతాప తీర్మానం కోసం ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసుకుంటే రాజకీయాలు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘నిజమైన ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు కూడా ఇలా మాట్లాడరు. అలాంటిది పార్టీలు మారిన వ్యక్తి ఇలా మాట్లాడితే ఎలా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడాలని ఏలేటికి హరీశ్ రావు సలహాలు సూచనలు ఇస్తున్నారని, ఇది సభ మర్యాద కాదని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, ఆయన గురించి మాట్లాడాలని మంత్రి సూచించారు. కాగా, మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.