- ఎమ్మెల్యేలు, ఎంపీల ఆధ్వర్యంలో 24 గంటల నిరసన: మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న ‘బీజేపీ రైతు హామీల సాధన దీక్ష’ చేపడుతున్నట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. అన్నదాతలకు అండగా 24 గంటల పాటు దీక్ష చేస్తామని వెల్లడించారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇందిరాపార్కు వద్ద సెప్టెంబర్ 30న ఉదయం 11 గంటల నుంచి అక్టోబర్ 1వ తేదీ ఉదయం 11 గంటల దాకా ఈ దీక్ష కొనసాగుతుంది.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు అటెండ్ అవుతారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలి. రైతు రుణమాఫీతో పాటు, రైతు భరోసా కింద రూ.15 వేలు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.12 వేలు ఇవ్వాలి. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి.. అసెంబ్లీలో కనీసం చర్చ కూడా పెట్టలేదు’’అని మహేశ్వర్ రెడ్డి అన్నారు.