నిర్మల్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటమి భయం పట్టుకుందని, బీజేపీకి పెరుగుతున్న జనాదరణను చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ రూరల్ మండలంలోని వెంగ్వాపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నాగభూషణం, వీడీసీ చైర్మన్ తిరుపతి, నిర్మల్ మాజీ ఎంపీపీ దౌలానాబీ, ఆత్మ డైరెక్టర్ తోటరాజు, విద్యావంతుల వేదిక మాజీ చైర్మన్ వంశీధర్ రెడ్డి, ఉప సర్పంచ్ అశ్విన్ రెడ్డి, మెంబర్లతోపాటు దాదాపు 500 మందికిపైగా బీజేపీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి మహేశ్వర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా స్వచ్ఛందంగా బీజేపీలో చేరుతున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పార్టీలకు ఓటమి తప్పదన్నారు. కార్యక్రమంలో పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సాధం అరవింద్, పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ నూతల భూపతిరెడ్డి, కరిపె విలాస్, సామల వీరయ్య, జమాల్ తదితరులు పాల్గొన్నారు.