తెలంగాణలో కొత్తగా యూ ట్యాక్స్ .. ఇప్పటికే రూ.100 కోట్లు ఢిల్లీకి : మహేశ్వర్ రెడ్డి

తెలంగాణలో కొత్తగా యూ ట్యాక్స్ ..  ఇప్పటికే రూ.100 కోట్లు ఢిల్లీకి :  మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ‘యూ’ట్యాక్స్ పేరుతో వసూళ్లు మొదలయ్యాయని, ఈ పేరు మీద ఇప్పటికే రూ.500 కోట్లు చేతులు మారాయని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ సొమ్ములోంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.100 కోట్లను ఢిల్లీలో అధిష్టానానికి పంపించారన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులను కాంగ్రెస్ సర్కార్ అనేక విధానాలుగా క్షోభ పెడుతోందన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లలో 40 కిలోల బస్తాకు నాలుగు కిలోల చొప్పన అదనంగా కాంటా పెట్టి రైతుల నుంచి దోచుకుంటోందని మండిపడ్డారు. తాలు, తేమ పేరుతో 4 నుంచి 5 కిలోల ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తూ ధాన్యాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏటా కోటి 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతోందని, ఇందులో 13 వేల టన్నులు రైతుల నుంచి అధికంగా దోచిందేనని ఆయన అన్నారు. ఈ విషయంపై తాము సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశామని చెప్పారు. రైతు సమస్యలపై ప్రభుత్వం అఖిల పక్షం వేయాలని డిమాండ్ చేశారు.