హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు!

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు!

న్యూఢిల్లీ: హర్యానాలో ఆప్​తో పొత్తుకు కాంగ్రెస్ మాజీ చీఫ్​ రాహుల్ గాంధీ ఆసక్తి కనబర్చారనే వార్తలను ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ స్వాగతించారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ ) సమావేశంలో ఆప్​తో భాగస్వామ్యాన్ని పరిశీలించాలని రాహుల్ కోరారని వార్తలు వెలువడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘సామాన్యులు, రైతులు, యువతకు వ్యతిరేకంగా పని చేస్తున్న బీజేపీని ఓడించడమే మా ప్రాధాన్యత.

కాంగ్రెస్​తో పొత్తుకు సంబంధించినంత వరకు కేజ్రీవాల్ విడుదలైన తర్వాతే తుది నిర్ణయం ఉంటుంది” అని తెలిపారు. ఇటీవల హర్యానా కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి షెల్జా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్​తో పొత్తును కొట్టిపారేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందని పార్టీ సొంతంగా బరిలోకి దిగుతుందని చెప్పారు.   కాగా, హర్యానాలో ఆప్​తో పొత్తు ఖరారు కాలేదని చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ తెలిపింది. మంగళవారం ఏఐసీసీ రాష్ట్ర ఇన్​చార్జ్ జనరల్ సెక్రటరీ దీపక్ బబారియా దీనిపై క్లారిటీ ఇచ్చారు.