డిసెంబర్ 11 నుంచి సింగరేణిలో ఆలిండియా లెవెల్‌‌ మైన్స్‌‌ రెస్క్యూ పోటీలు

  • 11 ఏండ్ల తర్వాత  సింగరేణి ఆతిథ్యం
  • పాల్గొననున్న 25 టీమ్​లు

గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో  ఈనెల 11 నుంచి ఐదురోజుల పాటు  ఆలిండియా మైన్స్‌‌ రెస్క్యూ పోటీలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా  వివిధ సంస్థల నుంచి 25 టీమ్‌‌లు పాల్గొననున్నాయి. ఈ టీమ్స్ లో 16 కోల్‌‌, 9 మెటల్‌‌ మైనింగ్‌‌ కంపెనీలు ఉన్నాయి. రెస్క్యూ పోటీల్లో తొలిసారిగా రాజస్థాన్‌‌ నుంచి  హిందుస్తాన్‌‌  జింక్‌‌  లిమిటెడ్‌‌ సంస్థకు చెందిన విమెన్స్​ టీమ్​ పాల్గొంటోంది. ఈ పోటీలను డైరెక్టరేట్‌‌ జనరల్‌‌  ఆఫ్‌‌  మైన్స్‌‌ సేఫ్టీ పర్యవేక్షణలో ఏటా వివిధ కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈసారి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పోటీలు జరగనున్నాయి.

 2012లో ఈ పోటీలను సింగరేణి సంస్థ నిర్వహించగా 11 ఏండ్ల తర్వాత మళ్లీ సింగరేణి ఆతిథ్యమిస్తున్నది. ఈ కాంపిటీషన్లు మొదలైనప్పటి నుంచి మహిళా టీమ్స్​ పాల్గొనలేదు. అయితే ఈ ఏడాదే తొలిసారిగా రాజస్థాన్‌‌  నుంచి హిందుస్తాన్‌‌  జింక్‌‌  లిమిటెడ్‌‌  మహిళల జట్టు పాల్గొంటోంది. ఈ పోటీల్లో డ్రిల్‌‌, థియరీ, స్టాచుటరీ, ఫస్ట్‌‌ ఎయిడ్‌‌, రెస్క్యూ వర్క్‌‌, రెస్క్యూ అండ్‌‌  రికవరీ, ఓవరాల్‌‌  ఫెర్ఫార్మెన్స్‌‌లో  జట్లు తలపడతాయి. 2022లో  రాజస్థాన్‌‌ లో ఈ పోటీలు జరగగా కోల్‌‌ క్యాటగిరిలో ఓవరాల్‌‌ ఛాంపియన్‌‌గా  సింగరేణి నిలిచింది. అదే స్ఫూర్తితో ఈ ఏడాది గెలిచేందుకు సింగరేణి టీమ్​ దృష్టి పెట్టింది. ఇందుకోసం టీమ్‌‌  మెంబర్లు  ప్రత్యేక శిక్షణ పొందారు.