రైతు కూలీలకు ఏటా రూ. 12వేల సాయం.. ఈ ఏడాదే ప్రారంభం
ఇకపై పంటల బీమా అమలు
సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ నకిలీ విత్తనాలకు చెక్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్ రైతన్నకు జైకొట్టింది. బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 2024–25 బడ్జెట్లో ఆ రంగానికి రూ.72,659 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. 2023–24 బడ్జెట్లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రూ.26,831కోట్లు కేటాయించగా.. తాజాగా ప్రభుత్వం డబుల్ కంటే ఎక్కువే నిధులు కేటాయించింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతుబీమా, పంటల బీమాతోపాటు వ్యవసాయ కూలీలకు కోసం ప్రత్యేక రైతు కూలీ భరోసా (రూ. 12,000 సాయం) ప్రకటించింది.
రైతు కూలీలకు సాయం
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం చేసే రైతులతో పాటు రైతులకు పంటల్లో పని చేస్తూ చేదోడు వాదోడుగా నిలచే రైతు కూలీలకు ప్రాధాన్యం కల్పించింది. గతంలో ఏ ప్రభుత్వం గుర్తించని రైతు కూలీలకు మొదటిసారిగా ఏటా రూ. 12 వేల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఈ సంవత్సరంలోనే దీన్ని ప్రారంభించనుంది. ఇందుకోసం బడ్జెట్లో రూ.1,200 కోట్లు కేటాయించింది. ‘‘భూమిలేని రైతు కూలీల ఆర్థిక, జీవన స్థితిగతులు మెరుగు పరచడానికి మా ప్రభుత్వం లక్షలాది రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నది” అని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.
రైతు బీమా.. పంటల బీమా
రైతు బీమా పథకానికి బడ్జెట్లో రూ.1,589 కోట్లు కేటాయించారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం అందనుంది. ప్రతి రైతుకు ప్రీమియంగా రూ.3,600 చొప్పున ఎల్ఐసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. 18 ఏండ్ల నుంచి 59ఏండ్ల వయసున్న రైతులు రైతు బీమాకు అర్హులు. కొన్నేండ్లుగా రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలులో లేకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. వేల కోట్ల పంట నష్టం జరిగినా రైతులకు నయా పైసా పరిహారం అందేది కాదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమాలో చేరాలని నిర్ణయించింది.
గత ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన బీమా ప్రీమియం చెల్లించక రైతుల కడగండ్లకు కారణమైందని, తమ ప్రభుత్వం పంట బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) స్కీమ్‌లో చేరాలని నిర్ణయించిందని భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా వారి పంటలకు పూర్తి భద్రత ఈ పథకం కల్పించనుంది. ఇందుకోసం బడ్జెట్లో రూ. 1,300 కోట్లు కేటాయించారు.
సన్న వరికి బోనస్
సన్న వడ్లు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇందుకోసం బడ్జెట్లో రూ.1,800 కోట్లు కేటాయించింది. ‘‘రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించి, వాటిని పండించిన రైతుకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల సన్నరకాల వరిని పండించే సాగు భూమి విస్తీర్ణం పెరిగి, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది” అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్ర వాటా కింద బడ్జెట్లో కేటాయింపులు చేశారు. మొత్తం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కోసం రూ.196.57కోట్లు వ్యవసాయ బడ్జెట్లో పొందుపరిచారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం ప్రకటించింది. ‘‘నాణ్యమైన విత్తనాలు లభిస్తేనే రైతుకు సరైన దిగుబడి వస్తుంది. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర రైతాంగం నకిలీ విత్తనాల వల్ల పూర్తిగా నష్ట పోయారు. రైతాంగం అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి నకిలీ విత్తనాల కారణంగా వృథా అవుతుంది. మా ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కృత నిశ్చయంతో ఉంది” అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
అనుబంధ రంగాలకూ దండిగా
ఈయేడు వ్యవసాయంతో పాటు దాని అనుబంధరంగాలకు ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చింది. రైతుల వ్యవసాయ పంపుసెట్ల కోసం ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్ విద్యుత్ సబ్సిడీ కోసం బడ్జెట్లో రూ.11,500 కోట్లు కేటాయించింది. అదే విధంగా వ్యవసాయ సాగు భూముల నీటి పారుదలకు రూ.10,829 కోట్లు కేటాయించింది. హార్టికల్చర్ కు ఈ బడ్జెట్ లో రూ. 737 కోట్లు, పశుసంవర్ధక రంగానికి రూ. 1,980 కోట్లు ప్రతిపాదించారు.
రైతుభరోసాకు 15 వేల కోట్లు
రైతు బంధు స్థానంలో తీసుకొచ్చిన రైతు భరోసా స్కీమ్‌కు బడ్జెట్లో రూ.15,075 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలోని రైతాంగానికి పెట్టబుడి సాయంగా రెండు పంటలకు కలిపి ఎకరాకు రూ. 15 వేల చొప్పున ఇవ్వనుంది. గత బీఆర్ఎస్ సర్కారు ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వగా అదనంగా మరో రూ. 5 వేలు ప్రస్తుత సర్కారు ఇవ్వనుంది. ‘‘గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కింద రూ. 80,440 కోట్లు ఖర్చు చేసింది.
దీనిలో అధిక శాతం లబ్ధి అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందడం వల్ల నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయి. గత ప్రభుత్వం చేసిన ఈ నిర్వాకం వల్ల ప్రభుత్వ సొమ్ము నిరుపయోగమైంది. గత ప్రభుత్వం, వారు రూపొందించుకున్న నియమ నిబంధనలను వారే తుంగలో తొక్కారు. ఇది చాలా శోచనీయం. క్షమించరాని నేరం” అని బడ్జెట్ స్పీచ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘
‘మా ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా, రైతుబంధు పథకం స్థానం రైతు భరోసాను తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి రూ.15,000 చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. దీని అమలుకు విధివిధానాలు చర్చించి నిర్ణయించడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ జిల్లాలలో పర్యటించి ఆ ప్రాంత రైతులను, వ్యవసాయ రంగ నిపుణులను, మేధావులను సంప్రదించి, వారి అభిప్రాయాలను సేకరించింది. ప్రజాభిప్రాయాలన్నింటిని క్రోడీకరించి వాటిని గౌరవ సభలో ఉంచి, చర్చించి గౌరవ శాసన సభ్యులందరి అభిప్రాయాన్ని తీసుకొని.. అమలు చేయాల్సిన విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటాం” అని ఆయన వివరించారు.