బొగ్గు గనుల కేటాయింపు ఆలస్యం కావొద్దు :  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

బొగ్గు గనుల కేటాయింపు ఆలస్యం కావొద్దు :  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో శుక్రవారం జరగనున్న బొగ్గు గనుల వేలం, బ్లాకుల కేటాయింపులో ఎలాంటి జాప్యం జరగొద్దని అధికారులను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. కొత్తగా కేటాయించే బొగ్గు గనులకు అనుమతుల ప్రక్రియ శరవేగంగా జరగాలని దిశానిర్దేశం చేశారు. గురువారం ఢిల్లీలోని తన ఆఫీసులో అధికారులతో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వేలంలో కేటాయించిన బొగ్గు బ్లాకుల నుంచి వీలైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభం కావాలని ఆదేశించారు. వేలంలో గనులను దక్కించుకున్న కంపెనీలు బొగ్గును ఎక్కడికైనా ఎగుమతి చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ‘‘దేశంలో బొగ్గు దిగుమతిని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 161 బొగ్గు గనులను కేటాయించాం. వీటిలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ), వెస్ట్ బెంగాల్ పవర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(డబ్ల్యూబీపీడీసీఎల్), పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎస్పీసీఎల్), కర్నాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(కేపీసీఎల్), వేదాంత, హిందాల్కో, అదానీ తదితర కంపెనీలు ఉన్నాయి” అని తెలిపారు.