ఎన్​ఎస్​ఎఫ్​ ఫారాల్లో.. ఇందిరమ్మ ఇండ్ల టెన్షన్

 ఎన్​ఎస్​ఎఫ్​ ఫారాల్లో..  ఇందిరమ్మ ఇండ్ల  టెన్షన్
  • జాగాలకు పత్రాల్లేక అయోమయం  
  • గ్రామ పంచాయతీలుగా మారిన ఫారాలు
  •  ఫారం భూమిలో వందలాది కుటుంబాలు స్థిర నివాసం
  •  ప్రభుత్వ ఇండ్ల మంజూరు దరఖాస్తులు చేసుకున్న కొందరు పేదలు
  •  ఇంటి జాగాల ఓనర్​షిప్​ లేనందున సర్వే సిబ్బంది అయోమయం

నిజామాబాద్, వెలుగు:  నాలుగు మండలాల్లో విస్తరించి ఉన్న ఈ ఫారాల నిర్వహణను గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఈ ఫారాల్లో వందలాది కుటుంబాలు ఇండ్లు కట్టుకుని ఉంటున్నాయి. అయితే వారికి ఇంత వరకు ఇంటి స్థలాలకు సంబంధించి ప్రభుత్వం పట్టాలుగాని, హక్కు పత్రాలుగాని ఇవ్వలేదు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు తమకు ఇండ్లు వస్తాయా  లేదా అని అనుమానపడుతున్నారు. 

నాటి అగ్రికల్చర్​ సెంటర్లే ఫారాలు 

నిజాం చక్కెర ఫ్యాక్టరీ ముడిసరుకు చెరకు కోసం రైతులపై పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా 16 వేల ఎకరాల్లోయాజమాన్యం 14 అగ్రికల్చర్​ (ప్లాంటేషన్​) ఫారాలు ఏర్పాటు చేసింది. బోధన్, కోటగిరి, ఎడపల్లి, రెంజల్​ మండలాల్లో విస్తరించిన ఈ ఫారాల్లో చెరుకు పండించడానికి ఫ్యాక్టరీ ఆఫీసర్లు, సిబ్బంది కృషి చేసేవారు. చెరుకు పండించడానికి దాదాపు 10 వేల వ్యవసాయ కార్మిక కుటుంబాలు ఈ ఫారాల్లో స్థిరపడ్డాయి.

ఆ కుటుంబాలకు మౌలిక వసతులతో వారి పిల్లలకు విద్య, వైద్యం తదితర అవసరాలు  ఫ్యాక్టరీ తరపున సమకూరేవి. 1996లో ఫ్యాక్టరీ తరపున ప్లాంటేషన్​ వింగ్​ క్లోజ్​ కాగా 2002లో చక్కెర మిల్లు ప్రైవేటు పరమైంది. అంతకు ముందే ఫారాల ల్యాండ్​లోని కొంత ప్రభుత్వం​ కార్పొరేషన్​లకు విక్రయించి మిగితా భూమిని  రైతులకు వేలం పాటద్వారా అమ్మేశారు.  ఫారాలలోని క్వార్టర్లను విక్రయించి మౌలిక వసతుల నిర్వహణ బాధ్యతను కూడా అదే టైంలో గ్రామపంచాయతీలకు అప్పగించారు.

ఓనర్​ షిప్​లేని జాగాలతో సమస్య

గ్రామ పంచాయతీలకు అప్పగించక ముందే వెలిసిన ఒక్కో ఫారం సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ఉంది.  అక్కడ కూలీలుగా పనిచేసిన కుటుంబాలు స్తోమతను బట్టి గుడిసెలు,  ఇండ్లు నిర్మించుకున్నారు. గ్రామ పంచాయతీలకు ట్యాక్స్​లు చెల్లిస్తున్నారు. ఆ రశీదుల  ఆధారంగా  ఇండ్ల సేల్​రిజిస్ట్రేషన్​లు జరుగుతున్నాయి.  అయితే పూరిళ్లలో ఏండ్ల తరబడి నివాసం ఉంటున్న వారి దగ్గర మాత్రం ఇంటి జాగా పత్రాలేవీ లేవు. పిల్లల పెండ్లిళ్లు జరిగి వేరు పడిన కుటుంబాలు ఉన్నాయి.  ఇలాంటి వారు ప్రతి ఫారం నుంచి కనీసం వంద మంది చొప్పున సుమారు 1,500 దాకా ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్​లు పెట్టుకున్నారు. ఇండ్ల మంజూరు కోసం సర్వే చేపట్టిన సిబ్బంది ప్రస్తుతం వారు నివసిస్తున్న పూరిళ్ల ఫొటోలు సేకరిస్తున్నారు. . సొంత జాగా డాక్యుమెంట్లు లేకుండా ఇళ్లు శాంక్షన్​ చేయొద్దని సర్కారు నిబంధనలు ఉండడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు.  

పర్మనెంట్​ పరిష్కారం అవసరం

జిల్లాలోని బోధన్​ మండలంలో ఊట్​పల్లి, బెల్లాల్, పాండుఫారం, నర్సాపూర్, సంగెం, ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి, ఏఆర్​పీ క్యాంప్, కోటగిరి మండలంలోని జల్లాపల్లి ఫారం, హంగర్గా, ఎక్లాస్​పూర్, రేంజల్​ మండలంలో సాటాపూర్, బోర్గాం, వీరన్నగుట్ట గ్రామ పంచాయతీలన్నీ గతంలోని  నిజాం చక్కెర ఫ్యాక్టరీ ఫారాలే. అక్కడున్న ల్యాండ్​లో ఇంటి స్థలాల సమస్యకు పర్మనెంట్​ పరిష్కారం చూపకపోతే  భవిష్యత్​లో మరిన్ని చిక్కులు వచ్చే ప్రమాదముంది. ఫారం ల్యాండ్​ను ఆబాదీ కింద పంచాయతీలకు అప్పగించినందున దానిని సర్కారు ల్యాండ్​గా పరిగణించి కలెక్టర్​ నేతృత్వంలో దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న వారికి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.