నిర్మల్, వెలుగు: అభివృద్ధిలో నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని వివిధ వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే నిర్మల్ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు మంజూరు చేశామని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నిర్మ ల్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
విశ్వనాథ్ పేట నుంచి బంగల్పేట్ చెరువు మీదుగా కలెక్టరేట్ వరకు ఫోర్ లేన్ రోడ్డు కోసం రూ.38 కోట్లు మంజూరయ్యాయని, సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే పట్టణంలోని ట్రాఫిక్ సమస్య కూడా కొంతమేరకు తొలుగుతుందని, బంగల్పేట్ చెరువు టూరిజం స్పాట్‌గా మారుతుందన్నారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ రాజేందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.