సంక్షేమ ప‌థ‌కం అంద‌ని ఇళ్లు లేదు : అల్లోల ఇంద్రకర‌ణ్ రెడ్డి

లక్ష్మణచాంద, వెలుగు :  సీఎం కేసీఆర్ సార‌థ్యంలోని బీఆర్ఎస్ స‌ర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని, మూడోసారి బీఆర్ఎస్​కే ప‌ట్టం క‌ట్టాల‌ని మంత్రి, నిర్మల్ నియోజ‌క‌వ‌ర్గ అభ్యర్థి అల్లోల ఇంద్రకర‌ణ్ రెడ్డి కోరారు. ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా సోమవారం లక్ష్మణచాంద మండ‌లంలోని కనకపూర్, వడ్యాల్, రాచపూర్, పీచర, ధర్మారం తదితర గ్రామాల్లో మంత్రి పర్యటించారు.

ఓటర్లను క‌లుస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు కొన‌సాగాలంటే బీఆర్ఎస్ కే ఓటు వేయాల‌ని అభ్యర్థించారు. ఇటీవ‌ల ప్రవేశ‌పెట్టిన పార్టీ మేనిఫెస్టో నిరుపేద‌ల‌కు వ‌రమన్నారు. రాష్ట్రంలో సంక్షేమ ప‌థ‌కాలు అంద‌ని ఇళ్లు లేదని అన్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చే ఇతర పార్టీల నాయకులను నిలదీయాలని ప్రజలను కోరారు.

బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్న ఒక్క సంక్షేమ ప‌థ‌కమైనా అమ‌ల‌వుతుందా అని ఆ పార్టీల నాయకులను ప్రశ్నించాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి, మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకులు అల్లోల సురేందర్ రెడ్డి, పాకాల రాంచందర్, హన్మంత్ రెడ్డి, అడ్వాల రమేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.